Bhoothaddam Bhaskar Narayana Movie Review
TELUGUMIRCHI RATING : 3/5
సినిమాలో మేటర్ వుందో లేదు ప్రమోషనల్ కంటెంట్ చూసి చెప్పేయొచ్చు. టీజర్ ట్రైలర్ ఆకర్షిస్తేనే జనాలు థియేటర్ కి వెళ్ళడానికి ఇష్టపడతారు. ప్రమోషన్స్ లో ఎంతోకొంత బజ్ వుంటేనే ప్రేక్షకుల దృష్టి సినిమాపై పడుతుంది. అలా ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల ద్రుష్టిని ఆకర్షించిన సినిమా శివ కందుకూరి భూతద్ధం భాస్కర్ నారాయణ. ఒక డిటెక్టివ్ థ్రిల్లర్ కి మైథాలాజీ ఎలిమెంట్ ని జోడించిన ఈ సినిమా ట్రైలర్ టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. సినిమా చూడాలనే బజ్ క్రియేట్ చేశాయి. ప్రమోషన్స్ లో ఆకట్టుకున్న ఈ సినిమా.. థియేటర్స్ లో మెప్పించిందా? ఇందులోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు థ్రిల్ ఇచ్చాయా?
కథ: భాస్కర్ నారాయణ అలియాస్ భూతద్ధం భాస్కర్ నారాయణ (శివ కందుకూరి) చిన్నప్పుడే డిటెక్టివ్ కావాలని ఫిక్స్ అయిపోతాడు. దీనికి గల కారణం వాళ్ళ అన్నయ్య జీవితంలో జరిగిన ఓ ఘటన. కట్ చేస్తే.. కొన్నేళ్ళ తర్వాత.. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో వరుసగా జరిగిన హత్యలు సంచలనం రేపుతాయి. ఎవరో సైకో కిల్లర్ అమ్మాయిల తల నరికి ఆ స్థానంలో దిష్టి బొమ్మని వుంచుతాడు. ఈ సీరియల్ కిల్లింగ్స్ కేసుని విచారించడానికి భాస్కర్ నారాయణ బరిలోకి దిగుతాడు. తర్వాత ఏం జరిగింది ? ఆ సైకో కిల్లర్ ఎవరు ? ఎందుకు అలాంటి హత్యలు చేస్తున్నాడు? ఈ కేసుకి పురాణాలకు వున్న లింక్ ఏమిటి ? చివరికి సైకో కిల్లర్ ని భాస్కర్ నారాయణ పట్టుకోగలిగాడా? అనేది మిగతా కథ.
విశ్లేషణ: చిన్న సినిమాలకు కంటెంటే శ్రీరామ రక్ష. అందులోనే కొత్తదనం చూపిస్తే ప్రేక్షకుల ఆదరిస్తారు. అలాంటి కొత్తదనం ఇవ్వడానికి ప్రయత్నం చేసిన సినిమా భూతద్ధం భాస్కర్ నారాయణ. మామూలు ఒక థ్రిల్లర్ పురాణాలతో ముడిపెట్టె ఆలోచనే కొత్తగా వుంది. అలాంటి కొత్త పాయింట్ ప్రేక్షకులకు థ్రిల్ పంచేలా తీర్చిదిద్దాడు దర్శకుడు. హీరో డిటెక్టివ్ అవ్వడానికి గల కారణాలని సహజంగా చూపుతూ ఈ కథ మొదలౌతుంది. అసలు కథ మొదలుకావడానికి కాస్త సమయం తీసుకున్న దర్శకుడు ఒక్కసారి వరుస హత్యలు తెరపైకి వచ్చిన తర్వాత కథను గ్రిప్పింగ్ నేరేషన్ తో నడిపాడు.
భూతద్ధం భాస్కర్ నారాయణ జర్నీ సెకండ్ హాఫ్ లో మరింతగా రక్తికడుతుంది. కేసు విచారణలో వచ్చిన మలుపులు ప్రేక్షకులు థ్రిల్ పంచుతాయి. ఇక ఈ సినిమాకి ఒక ప్రత్యేకతని తీసుకొచ్చిన మైథాలజీ ఎలిమెంట్ ని కథలో చక్కగా బ్లెండ్ చేశాడు దర్శకుడు. ఆ ఎపిసోడ్ ని చాలా పక్కాగా తీశాడు. నిజానికి ఇలాంటి పాయింట్ తో తెలుగులో సినిమా రాలేదనే చెప్పాలి. సైకో కిల్లర్ ఎవరు ? అనే సస్పెన్స్ ని చివరి వరకూ కొనసాగించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు.
భూతద్ధం భాస్కర్ నారాయణ పాత్రలో శివ కందుకూరి ఒదిగిన తీరు ఆకట్టుకునేలా వుంటుంది. తన స్క్రీన్ ప్రజెన్స్, పెర్ఫార్మెన్స్ ప్రామెసింగ్ గా వుంటుంది. ఎక్కడా ఓవర్ ది బోర్డ్ వెళ్ళకుండా తన పాత్రలోనే ఉంటూ కథని ముందుకు తీసుకెళ్ళాడు. రాశి సింగ్ పాత్ర కూడా బలంగానే వుంటుంది. ఆ పాత్రకు ఆమె యాప్ట్ చాయిస్ అనిపించింది. దేవి ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్, శివ కుమార్, షఫీ పాత్రలు కూడా అలరిస్తాయి. చిన్న సినిమా అయినప్పటికీ ప్రామెసింగ్ సపోర్ట్ క్యారెక్టర్స్ వుండటం ఒక ప్లస్ అయ్యింది.
టెక్నికల్ గా శ్రీచరణ్ పాకాల నేపధ్య సంగీతం ఈ సినిమాకి మరో ఆకర్షణగా నిలిచింది. చాలా గ్రిప్పింగ్ మ్యూజిక్ ఇచ్చాడాయన. కెమరాపనితనం ఈ కథ టోన్ ని మ్యాచ్ చేసింది. విఎఫ్ఎక్స్ వర్క్ కూడా చెప్పుకునేలా వుంది. తెలుగులో మంచి థ్రిల్లర్ వచ్చి చాలా కాలమైయింది. అలాంటి సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకుడు తప్పకుండా చూసే చిత్రమిది.
ఫైనల్ పంచ్: భూతద్ధం భాస్కర్ నారాయణ.. మస్ట్ వాచ్ థ్రిల్లర్