సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ‘లాల్ సలామ్’. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. సుభాస్కరణ్ నిర్మాతగా.. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ లక్ష్మీ మూవీస్ గ్రాండ్‌గా విడుదల చేస్తోంది. ఈ క్రమంలో నేడు ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది.
‘ఊర్లో ఒక్క మగాడు లేడా? ఊర్లో ఉన్నొళ్లందరినీ తీసుకెళ్లి బొక్కలే వేశారు’ అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం అయింది. ‘మందిని కూడ బెట్టేవాడి కన్నా.. ఎవడి వెనకాల మంది ఉంటారో వాడే చాలా ప్రమాదకరం.. వాడ్ని ప్రాణాలతో వదిల పెట్టకూడదు’ అనే డైలాగ్‌తో రజినీకాంత్ ఎంట్రీ అదిరిపోయింది. ‘బిడ్డ సంపాదిస్తే ఇంటికి గౌరవం.. బిడ్డ సాధిస్తే దేశానికే గౌరవం’, ‘మతాన్ని నమ్మితే మనసులో ఉంచుకో.. మానవత్వాన్ని అందరితో పంచుకో.. ఇండియన్‌గా నేర్చుకోవాల్సింది అదే’ అని తలైవా రజినీకాంత్ చెప్పే డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. కాకపోతే ఈసారి సింగర్ మనో కాకుండా, సాయి కుమార్ రజినీకాంత్ కి డబ్బింగ్ చెప్పాడు.
ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమాలో కథ ఎలా ఉండబోతోందో అర్థం అవుతుంది. ఊరు.. ఊర్లోని రకరకాల మతాలకు చెందిన మనుషులు, రాజకీయ నాయకులు, క్రికెట్, మత ఘర్షణల మధ్య మొయినుద్దీన్ భాయ్ రాక వంటి అంశాలతో పవర్ ఫుల్ ట్రైలర్‌గా నిలిచింది. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రాబోతున్న ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్, జీవితా రాజశేఖర్, క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ తదితరులు నటించారు.