Bhagavanth Kesari Review : ‘భగవంత్ కేసరి’ రివ్యూ.. బాలయ్య బాబు హ్యాట్రిక్


చిత్రం: భగవంత్ కేసరి
తెలుగుమిర్చి రేటింగ్: 3.25/5
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, అర్జున్ రాంపాల్, కాజల్ అగర్వాల్, శ్రీలీల
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
సంగీతం: ఎస్ఎస్ థమన్
విడుదల తేది: అక్టోబర్‌ 19, 2023

రెండు బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్‌బస్టర్స్ అఖండ మరియు వీరసింహా రెడ్డి తర్వాత, బాలకృష్ణ తండ్రి మరియు కుమార్తె సెంటిమెంట్‌పై ఆధారపడిన ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భగవంత్ కేసరితో తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమా దసరా పండుగ సందర్భంగా ఈరోజు (అక్టోబర్ 19) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీలీల ప్రధాన పాత్ర(బలకృష్ణ కూతురిగా)లో నటించగా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ ఈ సినిమాలో విలన్ గా నటించాడు. టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక టీజర్, ట్రైలర్ సహా ప్రమోషనల్ కంటెంట్ అంతా సినిమా మీద ఏర్పడ్డ అంచనాలు అమాంతం పెంచేసింది. ఇక ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చేసిన నేపథ్యంలో ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.

ఒక కేసులో జైలుకు వెళ్లిన అడవి బిడ్డ నేలకొండ భగవంత్ కేసరి(నందమూరి బాలకృష్ణ) అక్కడి జైలర్(శరత్ కుమార్)కు దగ్గరవుతాడు. అయితే అనూహ్య పరిస్థితుల్లో జైలర్ మరణించే క్రమంలో తన బిడ్డ విజ్జి పాప(శ్రీలీల)ను భగవంత్ కేసరి కి అప్పచేప్పి చనిపోతాడు. తన తండ్రి కోరికని తీర్చడానికి విజ్జి పాపకి అండగా నిలపడతాడు కేసరి. మరోపక్క రాహుల్ సంఘ్వీ(అర్జున్ రాంపాల్) ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ప్రభుత్వంతో కలిసి చేస్తున్న డ్రగ్స్ దందాను బయటపెట్టడానికి ప్రయత్నించిన రాజకీయ నాయకుడిని చంపి అతని పీఏ దగ్గర ఉన్న ఆధారాల కోసం వెంటాడుతూ ఉంటారు. అయితే విజ్జి పాపను చంపేందుకు సంఘ్వీ ప్రయత్నించడంతో కేసరి రంగంలోకి దిగుతాడు. అంతకుముందే సంఘ్వీ తో కేసరికి గొడవ ఉంటుంది. అయితే అసలు కేసరికి సంఘ్వీతో ఉన్న పగ ఏంటి? కేసరి అసలు జైలుకు ఎందుకు వెళ్ళాడు? విజ్జి పాప తన తండ్రి అనుకున్న స్థానంలో ఉంటుందా? కేసరిని ఇష్టపడిన కాత్యాయని(కాజల్) తన ప్రేమను వ్యక్తం చేసిందా? సంఘ్వీ చివరికి ఏమయ్యాడు? విజ్జి పాపను రక్షించుకోవడం కోసం కేసరి ఏం చేశాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నందమూరి బాలకృష్ణ అయితే నేలకొండ భగవంత్ కేసరి అనే పాత్రలో ఒదిగిపోయాడు. మూడు భిన్నమైన గేటప్స్ లో కనిపిస్తూ తనదైన వేరియేషన్స్ చూపించాడు. ముందు నుంచి ఆయన తెలంగాణ యాసలో ఎలా మాట్లాడతాడు అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ పాత్రలో ఓదిగిపోయాడు. శ్రీలీల కూడా తన పాత్రలో అద్బుతంగా నటించింది. మొదటి భాగం చూసి ఇలాంటి పాత్ర ఎందుకు ఎంచుకుందా? అనే అనుమానం కలుగుతుంది కానీ సెకండ్ హాఫ్ తరువాత ఈ పాత్రకు ఆమె సూటబుల్ అని చెప్పొచ్చు. కాజల్ పాత్ర చిన్నదే అయినా ఉన్నంతలో ఆమె ఆకట్టుకునేలా నటించింది. కానీ ఆమె పాత్రను ఇరికించినట్టు అనిపించింది. ఇక విలన్ గా అర్జున్ రామ్ పాల్ కూడా తన క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. ఇక శరత్ కుమార్, ఆడుకాలం నరేన్, వీటీవీ నగేష్, మురళీధర్ గౌడ్, రఘుబాబు, జయచిత్ర, రచ్చారవి, శ్రవణ్ రాఘవేంద్ర వంటి వారు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. బ్రహ్మాజీ సినిమాను మలుపులు తిప్పే పాత్రలో కనిపించారు. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అలాగే డైరెక్షన్ కూడా చూసుకున్న అనిల్ రావిపూడి తన జోన్ లో నుంచి బయటకు వచ్చి ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా కమర్షియల్ మసాలా కూడా అందించే విషయంలో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా తెలంగాణ యాసలో డైలాగ్స్ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. మ్యూజిక్ గురించి మాట్లాడాలి అంటే ఉన్న మూడు పాటలతో ఆకట్టుకున్న తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాను మరో లెవెల్ కి తీసుకు వెళ్ళాడు. తమన్ కి బాలయ్యను చూస్తే పూనకం వస్తుంది ఏమో అనెంతలా ఆయన రెచ్చిపోయి ఆరార్ ఇచ్చాడు. ఇక స్పెషల్ గా ఈ సినిమాలో ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. పరిసరాల్లో ఉన్న వాటినే ఆయుధాలుగా మలిచి బాలకృష్ణ చేసిన యాక్షన్ సీక్వెన్స్ లు విజిల్స్ వేయించెలా ఉన్నాయి. మొత్తానికి బాలయ్య బాబు ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాడు.

ఫైనల్ పాయింట్ : మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ

తెలుగుమిర్చి రేటింగ్: 3.25/5