వెన్నెల కిశోర్ హీరోగా స్పై యాక్షన్ కామెడీ మూవీ ‘చారి 111’


వినోదానికి కేరాఫ్ అడ్రస్ ‘వెన్నెల’ కిశోర్. మేనరిజమ్స్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, నటనతో కావచ్చు.. వినోదంలో వైవిధ్యం చూపిస్తూ, ప్రేక్షకులకు నవ్వులు పంచుతూ అలరిస్తున్నారు. హాస్య నటుడిగా మాత్రమే కాదు, కథానాయకుడిగానూ తనకు సూటయ్యే క్యారెక్టర్లు వచ్చినప్పుడు సినిమాలు చేస్తుంటారు. వెన్నెల కిశోర్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘చారి 111’.

వెన్నెల కిశోర్ కథానాయకుడిగా బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్న సినిమా ‘చారి 111’. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్ హీరోగా నటించిన హిట్ సినిమా ‘మళ్ళీ మొదలైంది’ తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో వెన్నెల కిశోర్ సరసన సంయుక్తా విశ్వనాథన్ కథానాయికగా నటిస్తున్నారు. మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు సినిమాను ప్రకటించడంతో పాటు కాన్సెప్ట్ టీజర్ కూడా విడుదల చేశారు.

ఎప్పుడు ప్రశాంతంగా ఉండే సిటీకి ప్రమాదం వచ్చి పడుతుంది. దానిని ఎదిరించడం కోసం మాజీ ఆర్మీ అధికారి ప్రసాద్ రావు (మురళీ శర్మ) వస్తారు. అసలు ఆ సమస్య ఏమిటి? విలన్ ఎవరు? అనేది వెల్లడించలేదు. కానీ, హీరో క్యారెక్టర్ ఏమిటనేది చాలా క్లారిటీగా చూపించారు. కన్‌ఫ్యూజ్డ్ స్పై పాత్రలో వెన్నెల కిశోర్ వినోదం అందించనున్నారు. ఈషా పాత్రలో హీరోయిన్ సంయుక్త విశ్వనాథన్, మహి పాత్రలో ప్రియా మాలిక్ నటిస్తున్నట్లు తెలిపారు. హీరోయిన్ ఫైట్స్ చేయనున్నట్లు చూపించారు. ఇక ఈ సినిమాలో వెన్నెల కిశోర్, సంయుక్తా విశ్వనాథన్, మురళీ శర్మ లతో పాటు బ్రహ్మాజీ, సత్య, రాహుల్ రవీంద్రన్, పావని రెడ్డి, తాగుబోతు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.