ఈ రోజుల్లో తమ పెళ్లి వేడుకను చాలా ఘనంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఖర్చు ఎంతైనా పర్లేదు కానీ పెళ్లిని గ్రాండ్గా చేసుకోవాలనుకుంటున్నారు. అందుకే దీని కోసం ఎన్నో కలలు, ఊహల్లో తేలిపోతుంటారు. ఈ అపూర్వ ఘట్టాన్ని.. జీవితకాలం ప్రత్యేకంగా గుర్తుండిపోయేలా చేసుకోవాలని చూస్తారు. ఆకాశమంత పందిరేసి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఆ అవకాశాన్ని కల్పిస్తోంది అమెరికాకు చెందిన ఓ కంపెనీ. ఆకాశమంత పందిరి కాదు.. ఇప్పుడు ఆకాశంలోనే పెళ్లి చేసుకోవచ్చు. భూమికి లక్ష అడుగుల ఎత్తుకు వెళ్లి అంతరిక్షంలో కొత్త జీవితానికి శుభారంభం పలకొచ్చు. ఓ మనిషికి రూ.కోటి వసూలు చేసి ఆ అవకాశాన్ని కల్పిస్తానంటోంది అమెరికాకు చెందిన స్పేస్ పర్స్పెక్టివ్ అనే కంపెనీ. దీనికోసం స్పేస్ నెప్ట్యూన్ ఫ్లైట్ అనే ఒకదాన్ని రూపొందించింది. స్పేస్ నెప్ట్యూన్ అనే ఈ కార్బన్ న్యూట్రల్ బెలూన్లో.. వివాహం చేసుకోవాలనుకునే జంటలను కక్ష్యలోకి పంపుతాయి. తద్వారా జంటలకు అంతరిక్షంలో పెళ్లి చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామని ప్రకటించింది. భూమి నుంచి దాదాపు లక్ష అడుగుల ఎత్తులో అతిథులను పైకి తీసుకువెళ్లి వివాహ వేడుకను చూపిస్తుంది. ఆ తర్వాత మళ్లీ వెనక్కి తీసుకొస్తుంది. దీని కోసం ఎలాంటి రాకెట్లు ఉపయోగించరు. కార్బన్ ప్రమేయం ఉండదు. కేవలం పునరుత్పాదక హైడ్రోజన్ సహాయంతో నడుపుతారు. దీనిని 2024 లో ప్రారంభించాలని నిర్వాహకులు అనుకుంటున్నారు. ఇప్పటికే వెయ్యి టికెట్లు అమ్మినట్లు చెబుతున్నారు.