‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు అజయ్ భూపతి సరికొత్త వినోదాన్ని పరిచయం చేశారు. ఇంటెన్సిటీతో కూడిన యాక్షన్, రొమాన్స్, షాకింగ్ ట్విస్ట్‌లను కలిపి కల్ట్ సినిమా చూపించారు. ‘మహాసముద్రం’లో యాక్షన్ డోస్ మరింత పెంచారు. ఆ రెండు సినిమాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘మంగళవారం’. ఇందులో పాయల్ రాజ్‌పుత్ ఓ ప్రధాన పాత్రధారి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని, ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్ నేడు విడుదల చేశారు మేకర్స్.
‘మంగళవారం’ టీజర్ నిడివి 60 సెకన్లకు కొంచెం ఎక్కువ. అయితే, ఆ సమయంలో అజయ్ భూపతి చాలా అంశాలు చూపించి ఆసక్తి కలిగించారు. ఊరి ప్రజలు ఏం చూస్తున్నారు? అనేది ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే… ‘ఏం చూశారండీ?’ అని లక్ష్మణ్ అడిగితే ‘ఒరేయ్ పులి! కాసేపు నువ్వు పువ్వు మూసుకుని గమ్మున ఉండరా’ అని అజయ్ ఘోష్ సమాధానం ఇచ్చారు. తుపాకీతో చైతన్య కృష్ణ గురి పెట్టడమూ చూపించారు. ఊరిలోకి పులి వచ్చిందా? లేదంటే ఏమైనా జరిగిందా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
ఇక టీజర్ ఎండింగ్ అయితే మరింత క్యూరియాసిటీ కలిగించింది. అమ్మవారి మాస్క్ ఎవరో తీసుకోవడం, గొంగళి కప్పుకొని మంటల మధ్యలో పాయల్ నిలబడటం, చివరిలో గట్టిగా ఆవేదన వ్యక్తం చేస్తూ అరవడం… ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలే. ఈసారి అజయ్ భూపతి ప్రేక్షకులకు థ్రిల్ ఇస్తూ భయపెట్టడానికి రెడీ అయినట్టు ఉన్నారు. ఆయన విజువల్స్‌కు తోడు అజనీష్ లోక్‌నాథ్ అందించిన నేపథ్యం సంగీతం కళ్ళు అప్పగించి చూసేలా చేసింది. ఇకపోతే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామని తెలిపారు మేకర్స్.