రూ.2 వేల నోట్లు రద్దు..


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. 2016 నవంబర్ 8 అర్థరాత్రి అర్ధంతరంగా నోట్ల రద్దు ప్రకటించిన కేంద్రం.. ప్రజల సౌకర్యార్థం రూ.2000, రూ.500 నోటు తీసుకొచ్చింది. కానీ, రూ.2000 నోటు వల్ల బ్లాక్ మనీ పెరుగుతుందన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో క్లీన్ నోట్ పాలసీలో భాగంగానే రెండు వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది.

ఇకపోతే రెండు వేల రూపాయల నోట్లు దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ రీజనల్ ఆఫీసుల్లో మార్చుకోవచ్చని తెలిపింది. అలాగే బ్యాంకులు సైతం రూ.2000 నోట్లను సర్క్యులేషన్‌లో పెట్టవద్దని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఇక రూ.2000 నోట్లు ఉన్న వారు వచ్చే సెప్టెంబర్ 30లోగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవాలని ఆర్బీఐ సూచించింది. మే 23 నుంచి రూ.2000 నోటు మార్చుకోవడానికి వెసులుబాటు కల్పించింది. కాకపోతే ఒక్కొక్కరు ఒక విడతలో కేవలం 10 నోట్లు మాత్రమే అంటే రూ. 20 వేలను మాత్రమే మార్చుకోవడానికి వీలు ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది.

ఇక 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే రూ.2 వేల నోట్ల ముద్రనను నిలిపివేసినట్లు ఆర్బీఐ పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రూ. 3.52 లక్షల కోట్ల 2 వేల నోట్లు చలామనీలో ఉన్నట్లు సమాచారం. అయితే ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడమే కాదు బ్లాక్ మనీని సైతం అరికట్టవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.