పవన్ కల్యాణ్ సినిమా అంటేనే మాస్ కి పండగ! స్టైల్, యాక్షన్, పాటలూ అన్నీ మాస్ ని అలరించడానికే అన్నట్టు రూపొందుతాయి. టైటిల్ కూడా వారిని ఆకర్షించేలా పెడతారు. బద్రి, గుడుంబా శంకర్, అన్నవరం, బంగారం, గబ్బర్ సింగ్… సినిమాలు ఎలాగున్నా టైటిల్స్ మాత్రం మాస్ కి నచ్చాయి. అయితే పవన్ తొలిసారి క్లాస్ బాట పట్టాడు. త్రివిక్రమ్ సినిమాలో శైలి మార్చి… క్లాస్ కి గాలం వేస్తున్నాడు. అందులో భాగంగానే ఆ సినిమాకి ‘అత్తారింటికి దారేది’ అనే పేరు ఖరారు చేశారట. అంతకు ముందు సరదా అనుకొన్నా.. ఆ టైటిల్ పవన్ కి సాదా సీదాగా అనిపించిందట. అందుకే ‘అత్తారింటికి దారేది’ డిసైడ్ చేశారు. అయితే ఈ టైటిల్ పట్ల పవన్ అభిమానుల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. టైటిల్ ఇంత క్లాస్ గా ఉంటే ఎలా? అని ఆందోళన పడుతున్నారు. సినిమా అంతా సెంటిమెంట్ తో చుట్టేశారేమో అనే భయం కూడా మొదలైంది. మరోవైపు సినిమా కథకు ఈ టైటిల్ అయితేనే నప్పుతుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. టైటిల్ తోనే కట్టిపడేసేంత దమ్ము… ‘అత్తారింటికి దారేది’ లో లేదన్నది నిజం. ఆ మ్యాజిక్ కథ, కథనాలు, త్రివిక్రమ్ సంభాషణలు, పవన్ శైలిలో ఉంటే… అదే పది వేలు! అభిమానుల ఆలోచనలకు అనుగుణమైన టైటిల్ పెడతారా? లేదంటే దీనికే ఫిక్సవుతారా? అనేది త్వరలోనే తేలిపోనుంది.