ఈ సినిమాకు కథే హీరో.. సాయిధరమ్ తేజ్


సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న మిస్టీక్ థ్రిల్లర్ మూవీ ‘విరూపాక్ష’. కాగా సంయుక్త మీనన్ కథానాయికగా నటించిన ఈ సినిమా కార్తీక్ దండు దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్.. ప్రేక్షకుల్లో ఈ సినిమా పట్ల ఆసక్తి నెలకొల్పింది. ఇక ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్ లో ఆదివారం రాత్రి ‘క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఈవెంట్’ పేరుతో చిత్రయూనిట్ ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ‘మొదటగా తాను అందరి దీవెనలు, ప్రార్థనలతో ఆరోగ్యంగా వున్నానని చెప్పాడు. అనంతరం 2019లో ఈ కథ విన్నాను. చిన్న ఆఫీస్‌లో ఈ కథ విన్నాను. ముందుగా సుకుమార్ నుంచి కాల్ వచ్చింది. కథ విను.. కచ్చితంగా నీకు నచ్చుతుంది. చేస్తావ్ అని అన్నారు. సుకుమార్ గారు కదా?.. ఏదో లవ్ స్టోరీ చెబుతారని అనుకున్నా. కానీ నన్ను భయపెట్టాడు డైరెక్టర్ కార్తీక్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అప్పుడే ఫిక్స్ అయ్యాను. ఈ సినిమాను చూసి మా అమ్మ, మీ అమ్మగారు గర్వంగా చెప్పుకుంటారు. ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. దర్శకుడు కార్తీక్‌కు హ్యాట్సాఫ్. శ్యాం గారి కెమెరా పనితనానికి హ్యాట్సాఫ్. నాగేంద్ర గారి ఆర్ట్ వర్క్ అద్భుతంగా ఉంది. విరూపాక్ష ప్రపంచాన్ని అద్భుతంగా రూపొందించారు. కార్తీక్ విజన్‌కు అజనీష్‌ ప్రాణం పోశారు. బీజీఎం అదరగొట్టేశారు. పాటలు బాగా వచ్చాయి. సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. నటీనటుల సహకారంతోనే నేను నటించగలిగాను. సునిల్, సాయి చంద్, బ్రహ్మాజీ, అజయ్, సంయుక్త ఇలా అందరూ నాకు ఎంతగానో సహకరించారు. నాకు సెట్‌లో ఆరోగ్యం బాగా లేకపోయినా నాకోసం షూటింగ్ క్యాన్సిల్ చేశారు. మా నిర్మాతలకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. నన్ను సపోర్ట్ చేసిన విరూపాక్ష టీం, సుకుమార్ గారికి థాంక్స్. ఈ సినిమాకు కథే హీరో. హారర్ సినిమా చూడటమే ఓ చాలెంజింగ్. నటించడం ఇంకా పెద్ద చాలెంజ్. తారక్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. మేం చాలా క్లోజ్‌గా ఉంటాం. ఈ సినిమాకు వాయిస్ ఓవర్ కావాలని అడిగిన వెంటనే ఇచ్చారు. నా కోసం, నిర్మాత బాపి గారి కోసం, సుకుమార్ గారి కోసం వెంటనే ఓకే చెప్పారు. ఇప్పుడు సినిమాను చూసే విధానం మారింది కాబట్టి మంచి సినిమాను పాన్ ఇండియాగా రిలీజ్ చేద్దామని అనుకున్నాం. ఓ ఫిక్షన్ స్టోరీ అందరికీ రీచ్ అవుతుందని పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నాం’ అన్నారు.