దేశంలో అతిపెద్ద కరెన్సీ నోటు 2000 అని అందరికీ తెలుసు. 2016లో డీమానిటైజ్ చేసిన తరువాత దేశంలో అప్పటి వరకు పెద్ద నోట్లుగా ఉన్న 500, 1000 నోటు బ్యాన్ అయింది. ఆ తరువాత కొంతకాలానికి కొత్త 500, 2000 నోటు చెలామణిలోకి వచ్చింది. ఆర్బీఐ కొత్త నోట్లను ప్రింట్ చేసింది. అయితే, గత కొంతకాలంగా దేశంలో 2000 నోటు కనిపించడం లేదు. ఈ నోటును నిలిపివేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. నిజంగానే 2000 నోటు ఆగిపోయిందా లేదా అన్నది ప్రభుత్వమో లేదా ఆర్బీఐనో చెప్పాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే, దేశంలో పెద్దనోటు 2000 అని అనుకుంటే పొరపాటే. అంతకంటే పెద్ద నోటును ఆర్బీఐ గతంలో చలామణిలోకి తీసుకొచ్చింది. అదే పదివేల నోటు.
ఈ పదివేల నోటును ఆర్బీఐ మొదటగా 1938లో ముద్రించింది. అయితే, ఎనిమిదేళ్లకే అంటే 1946లో ఈ నోటును రద్దు చేసింది. చిల్లర సమస్యలు, ఆర్థిక సమస్యల కారణంగా పదివేల నోటును రద్దు చేశారు. ఆ తరువాత మరోసారి 1954లో ఈ నోటును తిరిగి ముద్రించారు. అప్పటి నుండి 24 ఏళ్లపాటు ఈ నోటు చలామణిలోకి వచ్చింది. చివరిగా పదివేల నోటును 1978లో రద్దు చేశారు. ఆర్బీఐ 2,5,10,20,50,100, 200,500, 1000,2000,10000 నోటును ముద్రించే అవకాశం ఉంటుంది. కానీ, ముద్రించే అవకాశం ఉన్నా పరిస్థితులను అనుసరించి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి మాత్రమే ముద్రించవలసి ఉంటుంది.