ఆస్ట్రేలియా టీ20 జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. గతేడాది సెప్టెంబర్‌లోనే వన్డే కెరీర్‌కు ముగింపు పలికిన ఫించ్ ఇప్పుడు కేవలం టీ20లకే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తాజాగా అన్ని ఫార్మాట్లలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ వరకు కెరీర్‌ను కొనసాగించలేనని అందుకే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకునేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నానని తెలిపాడు.
ఈ సందర్భంగా కెరీర్ ఆసాంతం తనకు మద్దతుగా నిలిచిన క్రికెట్ ఆస్ట్రేలియాకు, సహచరులకు, సహాయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు. కెరీర్ ఎత్తుపల్లాల్లో తనకు అండగా నిలిచిన కుటుంబానికి, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు.
కాగా ఆస్ట్రేలియాకు తొలి టీ20 వరల్డ్‌కప్ అందించిన స్టార్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ 2011లో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. చివరిసారిగా గతేడాది అక్టోబర్ 31న ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కనిపించాడు. ఇక తన కెరీర్‌లో ఫించ్ ఐదు టెస్టులు, 146 వన్డేలు, 103 టీ20లు ఆడాడు. అంతేకాదు అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు (172) ఫించ్ పేరిటే ఉంది.టెస్టుల్లో 278, వన్డేల్లో 5,406, టీ20ల్లో 3,120 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫిబ్రవరి 9 నుంచి తొలి టెస్ట్ మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే.