పెద్దగట్టు జాతరకు పోటెత్తిన భక్తులు


తెలంగాణలోనే రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన దురాజ్ పల్లి లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతరకు భక్తులు పోటెత్తారు. లింగ నామస్మరణతో పెద్దగట్టు మారుమోగుతోంది. ఈ నెల 5 నుంచి 9 వరకూ జాతర జరగనుంది. జాతరలో మొదటిరోజు సూర్యాపేట రూరల్ కేసారం గ్రామం నుంచి దేవరపెట్టెను యాదవ కులస్తులు కాలినడకన పెద్దగట్టుకు చేర్చారు. అర్ధరాత్రి దాటిన తర్వాత దేవరపెట్టె గొల్లగట్టుకు చేరుకుంది. అలాగే లింగమంతుల స్వామి, అమ్మవార్లకు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి ఆదివారం రాత్రి పట్టువస్త్రాలు సమర్పించారు.

ఈరోజు జాతరలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, తెలంగాణ షీప్‌ అండ్‌ గోట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దూదిమెట్ల బాలరాజు యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కాగా సోమవారం పెద్దగట్టు జాతరకు భక్తులు లక్షలాదిగా తరలిరావడంతో గట్టు పరిసరాలన్నీ భక్త జన సంద్రంగా మారాయి. లింగో ఓ లింగో అంటూ భక్తులు గంపలు, బోనాలతో, మేకపోతులతో, డోలు వాయిద్యాలతో లింగమతుల దర్శనానికి తరలివచ్చారు.

జాతర సందర్భంగా ఈ రోజు సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో విద్యాసంస్థలకు ప్రభుత్వ అధికారులు సెలవు ప్రకటించారు. అంతేకాదు జాతర సందర్భంగా ఫిబ్రవరి 5 నుంచి హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను మళ్లించారు. హైదరాబాద్- విజయవాడ వైపు వెళ్లే వాహనాలు టేకుమట్ల వద్ద ఉన్న ఖమ్మం వైపు వెళ్లే 365 బీబీ బైపాస్ మీదుగా నామవరం, గుంజలూరు స్టేజ్ నుంచి కోదాడ వైపు మళ్లించారు.