ప్రశాంతంగా ‘గ్రూప్-1’ ప్రిలిమ్స్ పరీక్ష పూర్తి


ఏపీలో ఖాళీగా ఉన్న 111 ‘గ్రూప్-1’ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఆదివారం (జనవరి 8న) ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో 297 పరీక్షా కేంద్రాలను ఏపీపీఎస్సీ ఏర్పాటు చేసింది.

అత్యధికంగా విశాఖపట్నంలో 42 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. అత్యల్పంగా చిత్తూరులో 4 పరీక్ష కేంద్రాలను మాత్రమే ఏర్పాటుచేశారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించింది. రాతపరీక్షకు 1,26,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 1,06,473 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో 87,718 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారు. అంటే 82.38% అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అత్యధికంగా నంద్యాల జిల్లా 85.89% మంది అభ్యర్థులు హాజరుకాగా, అత్యల్పంగా కృష్ణా జిల్లా (73.99%) జిల్లా నుంచి హాజరయ్యారు.