ప్రపంచ దేశాల్లో మళ్లీ కరోనా కేసులు అకస్మాత్తుగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రద్దీ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించాలని సూచించింది. పలు దేశాల్లో ఈ మహమ్మారి పరిస్థితులపై అంచనా వేసేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇకపై కరోనా పరిస్థితులను చర్చించి చర్యలు తీసుకొనేందుకు ప్రతివారం ఈ ఉన్నత స్థాయి కమిటీ భేటీ కావాలని నిర్ణయించారు. ప్రపంచ దేశాల్లో కొత్త కేసులు పెరుగుతున్న వేళ అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, నిఘాను మరింత కట్టుదిట్టం చేయాలని కేంద్రమంత్రి మన్‌సుఖ్‌మాండవీయ ఆదేశించారు.