హైదరాబాద్ చుట్టూ ఉన్న అవుటర్ రింగ్ రోడ్ అవతల నిర్మించతలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్ కోసం భూసేకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొత్తం 344 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ను రెండు భాగాలుగా నిర్మించనున్న సంగతి తెలిసిందే. దీనిలో ఉత్తరభాగానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోద ముద్ర వేసింది. దీంతో అధికారులు భూసేకరణ పనుల్లో వేగం పెంచారు. ఈ ఉత్తరభాగం 158 కిలోమీటర్ల మేర ఉండనుంది. ఇందులో 11 జంక్షన్లు నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర రహదారి, జాతీయ రహదారితో కలిసే చోట జంక్షన్ నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భారత్ మాల ప్రాజెక్ట్ కింద భరించనుంది.