ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తిపై అప్రమత్తం, బూస్టర్‌ డోసులు సిద్ధం చేస్తున్న కేంద్రం

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో భారత్‌ బూస్టర్‌ డోసులు, చిన్నారులకు టీకా విషయంలో కీలక ప్రకటన చేసింది. దేశంలో బూస్టర్‌, అదనపు డోసుల పంపిణీ విషయమై రెండు వారాల్లో సమగ్ర విధానాన్ని ప్రకటిస్తామని కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ డా.ఎన్‌కె అరోడా సోమవారం వెల్లడించారు. అలాగే 44 కోట్ల మంది చిన్నారులకూ వ్యాక్సిన్‌ వేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు.

బూస్టర్‌, అదనపు డోసుల పంపిణీ విషయమై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టీఏజీఐ) రెండు వారాల్లో సమగ్ర విధానాన్ని తీసుకురానుంది. ఎవరికి ఈ డోసులు అవసరం? ఎప్పుడు ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి? తదితర విషయాలను ఇందులో పొందుపర్చనుంది. ప్రస్తుతం కొత్త వేరియంట్‌ కూడా వెలుగులోకి వచ్చింది. మరికొన్ని రోజుల్లో దాని గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి’ అని అరోరా చెప్పారు.