బయ్యారం ఉక్కు.. తెలంగాణ ప్రజల హక్కు!

harish rao bayyaram steelతెలంగాణలోనే బయ్యారం స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని తెరాస నేత హరీశ్ రావు డిమాండు చేశారు. ఖమ్మం జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన అన్ని వనరులు ఉన్నా.. విశాఖలో కర్మాగారం పెట్టడమేంటని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. “బయ్యారం ఉక్కు .. తెలంగాణ ప్రజల హక్కు” అని హరీష్ నినదించాడు. టీఆర్ ఎస్ భవన్ లో హరీష్ విలేకరులతో మాట్లాడుతూ.. ఖనిజాన్ని శుద్ధిచేసే కర్మాగారం తెలంగాణకు.. శుద్ధి చేసిన ఇనుప ఖనిజం విశాఖకు తీసుకెళ్తారా? అని ప్రశ్నించారు. బయ్యారం గనులను ఆంధ్రకు వదిలిపెట్టే సమస్యే లేదని, అవసరమైతే ప్రాణ త్యాగాలకు సిద్ధమని స్పష్టం చేశారు. ఇందుకోసం పార్టీలకతీతంగా అందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ నుంచి ఇనుప ఖనిజాన్ని విశాఖకు తరలించమని ప్రభుత్వం హామీ ఇవ్వాలని హరీష్ డిమాండ్ చేశారు. కాగా, బయ్యారం కర్మాగారంపై వైకాపా వైఖరి ఏంటో సూటిగా చెప్పాలని గౌరవాధ్యక్షురాలు విజయమ్మను హరీష్ ప్రశ్నించారు.