కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో అతిథి అధ్యాపకుల నియామకానికి ఉత్తర్వులు జారీ

కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో అతిథి అధ్యాపకుల నియామకానికి అనుమతిస్తూ సమగ్ర శిక్ష అభియాన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 21 నుంచి 31లోపు నియామకాలు పూర్తి చేయాలని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో పదవీవిరమణ పొందిన లెక్చరర్లు, స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్జీటీలను నియమించుకోవాలని పేర్కొంది. గతంలో నియమించుకున్న, ప్రస్తుతం పని చేస్తున్న అతిథి అధ్యాపకులు ఉంటే తొలగించాలని సూచించింది. సీఆర్టీ పోస్టులో నియమితులయ్యే అతిథి అధ్యాపకులకు గంటకు రూ.150, పీజీటీ పోస్టుల వారికి గంటకు రూ.250 చొప్పున చెల్లించాలని వెల్లడించింది.