హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక తో పాటు బద్వేలు ఉపఎన్నిక కు సంబదించిన నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది. నేటి నుంచి నామినేషన్లను స్వీకరిస్తామని అధికారులు చెప్పడం జరిగింది. కోవిడ్ నేపథ్యంలో నామినేషన్ కేంద్రంలో కోవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నారు. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు. నామినేషన్ కేంద్రం వద్ద 144 సెక్షన్ రెండు అంచెల భద్రత ఏర్పాటు చేశారు.
నోటిఫికేషన్ విడుదల కావడంతో జిల్లా వాప్యంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అక్టోబర్ నెల 8 తేదీ నామినేషన్ల ప్రక్రియకు చివరి తేదీగా నిర్ణయించారు. 11న నామినేషన్ల పరిశీలన ఉండగా 13న ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. కోవిడ్ నిబంధనల అమలు నేపథ్యంలో బహిరంగ సభకు 1,000 మందికి మించి అనుమతించబోమని ఎన్నికల అధికారులు తెలిపారు.
బద్వేలు నియోజకవర్గ పరిధిలోని బద్వేలు, గోపవరం, అట్లూరు, బి.కోడూరు, పోరుమామిళ్ల, కాశినాయన, కలసపాడు మండలాల పరిధిలో 272 పోలింగ్ స్టేషన్లు ఉండగా వాటి పరిధిలో జనవరి, 2011వ తేదీ నాటికి 2,12,739 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,06,650 మందికాగా 1,06,069 మంది మహిళలు ఓటర్లుగా ఉన్నారు. ఇక హుజురాబాద్ నియోజకవర్గానికి వస్తే..మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. అయితే తొలిరోజు ఎవరూ నామినేషన్లు వేసేటట్టు కనిపించడం లేదు. మంచి రోజు చూసుకుని అభ్యర్థులు నామినేషన్ దాఖలుకు వచ్చేటట్టు ఉన్నారు. ఈ నెల 30వ తేదీన పోలింగ్, నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.