కొవిడ్ రెండో దశ ఉద్ధృతి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కేంద్రం మరో ఉద్దీపనను ఆవిష్కరించింది. ఉత్పత్తిని, ఎగుమతుల్ని, ఉపాధి అవకాశాల్ని పెంచే రీతిలో ఆరోగ్యం, సామాజిక, ఆర్థిక రంగాలకు ఊతమిచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.6,28,993 కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. 15 విభాగాల్లో విభిన్న రకాల ఉపశమనాలు ప్రకటించారు. ఇందులో కొన్ని కొత్తవి కాగా, మరికొన్ని పాత పథకాల పొడిగింపులున్నాయి.
ఆరోగ్య రంగం బలోపేతం, కొవిడ్ కారణంగా దెబ్బతిన్న రంగాలకు చేయూత, రైతుల ఆదాయం రెట్టింపు, విద్యుత్తు సంస్కరణలు, ఎగుమతుల ప్రోత్సాహం, ఉపాధి కల్పన విభాగాలను దృష్టిలో ఉంచుకొని ‘మహమ్మారి నుంచి ఆర్థిక ఉపశమనం’ పేరుతో మంత్రి ఈ ప్రకటన చేశారు.