బ్లాక్ ఫంగస్ మందులకోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు

కోవిడ్ వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ, మ్యూకార్ మైకోసిస్ అనే సంక్లిష్ట వ్యాధితో బాధపడుతున్న రోగులకు నిర్దేశించే యాంఫో టెరిసిన్-బి. అనే ఔషధానికి కొన్ని రాష్ట్రాల్లో అకస్మాత్తుగా గిరాకీ పెరిగినట్టు ఒక పరిశీలనలో తేలింది. ఈ నేపథ్యంలో, ఈ మందు సమస్థాయిలో అందుబాటులో ఉండేలా చూసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. ఔషధ ఉత్పత్తిని బలోపేతం చేసేందుకు, దిగుమతి చేసుకునేందుకు పలు చర్యలు అమలు చేసింది. వివిధ రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్లోని రోగులకోసం 6.67లక్షల వయల్స్ యాంఫోటెరిసిన్-బి మందును ప్రభుత్వం సమీకరించగలిగింది. మ్యూకార్ మైకోసిస్ చికిత్సలో వినియోగించే యాంపోటెరిసిన్ డీయాక్సీ కోలేట్, పోసాకొనాజోల్ వంటి మందులతో పాటుగా, యాంఫోటెరిసిన్-బి. ఔషధాన్ని కూడా ప్రభుత్వం సమీకరించ గలిగింది.

మ్యూకార్ మైకోసిస్ వ్యాధి చికిత్సకోసం వినియోగించే మందుల లభ్యతను కేంద్ర ఔషధ వ్యవహారాల శాఖ ఎప్పటికప్పుడు మధింపు చేస్తూ వస్తోంది. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సి.డి.ఎస్.సి.ఒ.) అందించిన సమాచారం ఆధారంగా స్వదేశీ మార్కెట్లో, దిగుమతుల ద్వారా అందుబాటులో ఉన్న ఔషధాల పరిస్థితిపై అంచనా కోసం ఈ ప్రక్రియ చేపడుతున్నారు. ఉత్పత్తి, నిల్వ, సరఫరా, కొనుగోలు ఆర్డర్లు వంటి అంశాలపై వివరాలను ఉత్పత్తిదార్లనుంచి సేకరించే ప్రక్రియ ఈ ఏడాది మే నెలనుంచి జరుగుతోంది. గిరాకీకి, ఉత్పత్తికి మధ్య ఏర్పడిన అంతరాన్ని అధిగమించేందుకు సహకరించవలసిందిగా తయారీదార్లను కూడా కోరారు. ఇందుకు సంబంధించి వివిధ కేంద్ర శాఖల మధ్య ఈ ఏడాది మే నెల 10న ఒక సమావేశం జరిగింది. కేంద్ర ఔషధ వ్యవహారాల శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, సి.డి.ఎస్.సి.ఒ., ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ (డి.జి.హెచ్.ఎస్.)  ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఔషధాల లభ్యతపై ఈ సమావేశంలో కూలంకషంగా సమీక్ష నిర్వహించారు. వివిధ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పరమిత స్థాయిలో ఉన్న ఔషధ నిల్వలను కేటాయించవచ్చని, తద్వారా, గిరాకీ సరఫరా మధ్య నెలకొన్న అంతరాన్ని అధిగమించవచ్చని ఈ  సమీక్షా సమావేశం అభిప్రాయపడింది.