పలు అభివృద్ధి పనులపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన తెలంగాణ సిఎస్

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు), డిఎఫ్ఓలు, డిపిఓలు, డిఆర్ఓలు, మున్సిపల్ కమీషనర్లతో స్థానిక సంస్థల నిర్వహణ, హరితహారం, ధరణి, వ్యాక్సినేషన్ అంశాలపై బిఆర్కెఆర్ భవన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

నిర్దేశిత లక్ష్యాల మేరకు స్థానిక సంస్థలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, గ్రామాలలో రాత్రి బస చేసి పారిశుధ్ధ్యం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు పర్యవేక్షించాలి. పారిశుద్ధ్యం, పచ్చదనం, గ్రామ సభల నిర్వహణ, ప్రగతి నివేదికల తయారీ, సీజనల్ క్యాలండర్ తదితర అంశాలపై దృష్టి సారించాలని సీఎస్ అన్నారు. రిజర్వు ఫారెస్ట్ బ్లాక్ లలో మొక్కల పెంపకం, జిల్లాలలో అన్ని రహదారుల వెంట మల్టీలెవల్ ఎవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలి. పట్టణ ఖాళీ స్థలాలలో పెద్ద ఎత్తున మొక్కల పెంపకం, నూతనంగా నిర్మిస్తున్న జిల్లా సమీకృత కార్యాలయాలలో పచ్చదనం పెంపు తదితర అంశాలను సమీక్షించారు. మొక్కలు నాటడానికి గుంతల తవ్వకం, పల్లె ప్రకృతి వనాల ఏర్పాటును పూర్తి చేయాలని కలెక్టర్లను సీఎస్ కోరారు.

ఈ వీడియోకాన్ఫరెన్స్ లో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, జిహెచ్ఎంసి కమీషనర్ శ్రీ లోకేశ్ కుమార్, సిఐజి వి.శేషాద్రి, పంచాయతీ రాజ్ కమీషనర్ రఘునందన్ రావు, అటవీ శాఖ పిసిసిఎఫ్ శోభ, పిసిసిఎఫ్ (ఎస్.ఎఫ్) ఆర్.యం.డోబ్రియల్, సి.యం ఓఎస్డి ప్రియాంకా వర్గీస్, సిడిఎంఏ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.