కొత్త రేషన్ కార్డులపై మంత్రి తలసాని ఏమన్నారంటే ?

జంట నగరాల పరిధిలోని అర్హులైన పేదలకు వచ్చే వారం నుండి నూతన రేషన్ కార్డ్ లను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.

మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ హైదరాబాదు జిల్లా పరిధిలో నూతన రేషన్ కార్డ్ ల కోసం 1.77 లక్షల దరఖాస్తులు రాగా, 44,734 కార్డులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. 5,353 కార్డ్ లు పంపిణీకి సిద్దంగా ఉన్నాయని, 99,014 దరఖాస్తుల పరిశీలన చేయాల్సి ఉందని అన్నారు. నూతన రేషన్ కార్డ్ ల కోసం వచ్చిన దరఖాస్తుల వెరిపికేషన్ కోసం అవసరమైతే GHMC, రెవెన్యూ సిబ్బంది సహకారం తీసుకోవాలని ఆదేశించారు. రేషన్ కార్డ్ లలో మార్పుల కోసం 99,668 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో 38,846 కార్డుల మార్పులు పూర్తి చేసినట్లు ఆయన చెప్పారు.

కరోనా నేపద్యంలో ఒకొక్కరికి 15 కిలోలు చొప్పున బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అందులో భాగంగా ప్రస్తుతం హైదరాబాదు జిల్లా పరిధిలో ఉన్న 5,80,584 రేషన్ కార్డ్ లకు గాను 33 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మంజూరు చేయడం జరిగిందని చెప్పారు.