ఈటల రాజీనామా, కేసీఆర్ పై సంచలన వాఖ్యలు !

అందరూ అనుకున్నట్లుగానే మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసారు. హైద‌రాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు. అనంతరం ప్రగతి భవన్ లో జరిగే విషయాలను బయటపెట్టాడు.

ప్రగతి భవన్‌లో స్వతహాగా నిర్ణయాలు తీసుకునే నాయకులు లేరని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు గోళీలు ఇవ్వడం కోసమే ఉన్న ఒక ఎంపీ ద్వారా కేసీఆర్ అపాయింట్‌‌మెంట్ తీసుకొని ప్రగతిభవన్‌కు వెళ్తే సీఎం కలవలేదని ఆయన చెప్పారు. అసలు అది ప్రగతిభవన్ కాదు.. బానిసల నిలయం అని పేరు పెట్టుకోమని ఆ గోళీలు వేసే ఎంపీకి ఆనాడే చెప్పానని ఈటల అన్నారు. ఇక కేసీఆర్ కు తనకు ఐదేళ్ల క్రితమే మనస్పర్థలు వచ్చాయని తెలిపి షాక్ ఇచ్చాడు. కేసీఆర్ డబ్బును మాత్రమే నమ్ముకున్నాడని తెలిపారు.

ఉద్యమ నాయకులను గెలిపించిన చరిత్ర కరీంనగర్‌ జిల్లాకు ఉందని.. కేసీఆర్‌ కుట్రలు, డబ్బు, అణిచివేతను నమ్ముకున్నాడని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు.. కానీ ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోరన్నారు. హరీశ్‌రావు కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని.. సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదన్నారు. కేసీఆర్‌ ను కలవడానికి ఎమ్మెల్యేలం అందరం వెళితే గేట్ దగ్గరే ఆపేశారని.. రెండో సారి అపాయింట్ మెంట్ తీసుకుని పోయామని చెప్పుకొచ్చాడు.