చార్ ధామ్ యాత్రలో ప్రధాన కేంద్రమైన కేదార్నాథ్ ఆలయం ఈరోజు ఉదయం తెరచుకుంది. అయితే, కరోనా కారణంగా భక్తులు గత సంవత్సరంలో లానే ఈసారి కూడా కేదారనాధుడిని నేరుగా చూసే అవకాశం లేదు. ఆన్లైన్లో మాత్రమే భక్తులు భగవంతుని దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు. కేదార్నాథ్ ఆలయాన్ని తిరిగి తెరిచినట్లు ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ రావత్ తెలిపారు.ఈ మేరకు ఆయన ట్విటర్లో ప్రకటించారు. కరోనా కారణంగా కేవలం కొందరు అర్చకుల ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 5 గంటలకు ఆలయాన్ని తెరచి నిత్య పూజలు చేసినట్లు ఆయన తెలిపారు.
ఇక చార్ ధామ్ యాత్రలో మిగిలిన పవిత్ర ధామ్ కేంద్రాలు.. యమునోత్రి ధామ్ మే 14 న, గంగోత్రి ధామ్ మే 15 న తెరుచుకున్నాయి. ఇక మే 18 తెల్లవారుజామున 4:15 గంటలకు బద్రీనాథ్ ధామ్ తలుపులు తెరుచుకుంటాయి. కరోనా కారణంగా ఈ ఆలయాలలోకి కూడా భక్తులను అనుమతించరు.