ముంబైని…. పోయించ‌డానికి వెళ్తున్నాడు!

Puri-Jagannathబిజినెస్‌మెన్‌లో ఓ డైలాగ్ ఉంది. యే ముంబైకో…. ఆయా! అంటూ మహేష్‌బాబు చేత ప‌ల‌కించారు పూరి జ‌గ‌న్నాథ్‌. ఈ మార్కు డైలాగుల‌తోనే ఆ సినిమా గ‌ట్టెక్కింది. ఇప్పుడు పూరి ముంబై వెళ్లబోతున్నాడు. గురువు రామ్‌గోపాల్ వ‌ర్మని క‌ల‌సి వ‌చ్చేయ‌డానికి కాదు.. బిజినెస్ మెన్ డైలాగ్ నిజం చేయ‌డానికి. బాలీవుడ్‌లో త‌న స‌త్తా చాటేందుకు పూరి ప్రయ‌త్నాలు ముమ్మరం చేశాడు. ఇంత‌కు ముందు అమితాబ్‌బ‌చ్చన్‌తో బుడ్డా సినిమా తీసి.. హిట్ కొట్టాడు. ఆ త‌ర‌వాత అవ‌కాశాలు వ‌చ్చినా… అక్కడ సినిమా చేయ‌లేక‌పోయాడు. ఒక ద‌శ‌లో.. బిజినెస్‌మేన్ సినిమాని అభిషేక్ బ‌చ్చన్‌తో తీయ‌డానికి ప్రయ‌త్నించాడు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఆ త‌ర‌వాత తెలుగు సినిమాల‌తోనే బిజీ అయ్యాడు. ‘ఇద్దర‌మ్మాయిల‌తో’ త‌ర‌వాత బాలీవుడ్‌లో ఓ సినిమా తీయాల‌నేది పూరి ఆలోచ‌న‌. దానికి సంబంధించిన ప‌నుల‌పై దృష్టి పెట్టాడు. ఇక్కడ హిట్ కొట్టిన క‌థ‌నే ఎంచుకోవాలా? లేదంటే మ‌రో కొత్త క‌థ రాసుకోవాలా? అనే విష‌యంపై తీవ్రంగా ఆలోచిస్తున్నార‌ని స‌మాచారం. పూరి త‌ల‌చుకొంటే క‌థ‌ల‌కు కొర‌త ఏముంది? అస‌లు క‌థ అవ‌స‌రం ఏముంది?. సినిమాకి క‌థ అవ‌స‌రం లేద‌ని గొప్ప స్టేట్‌మెంట్ ఇచ్చారు క‌దా? మ‌రి పూరి ఆలోచ‌న ఎలా ఉందో? క‌థానాయ‌కుడు ఎవ‌రో? ఈ విష‌యాలు తెలియాలంటే వెయిట్ అండ్ సీ….