జీహెచ్ఎంసి లోని పారిశుధ్య కార్మికులనుండి మొదలు సీనియర్ అధికారి వరకు 100 శాతం అధికారులు, సిబ్బందికి ఈ నెల 15 వ తేదీలోగా కరోనా వాక్సిన్ వేయడం పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమీషనర్ ఆదేశించారు. మున్సిపల్ అధికారులు, పాలనా సిబ్బంది, పారిశుధ్య కార్మికులందరికీ వాక్సిన్ ఇప్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్. జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్ కు ఫోన్ చేసి ఆదేశించారు. ఈ నేపథ్యంలో మొత్తం అధికారులు, సిబ్బంది కార్మికులందరికి వాక్సిన్ వేసే కార్యక్రమాన్ని చేపట్టాలని కోరుతూ జోనల్ కమీషనర్లతో నెడ్ ఉదయం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జీహెచ్ ఎంసీ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్న ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కమీషనర్ మాట్లాడుతూ, ఎట్టి పరిస్థితిలోనూ వాక్సినేషన్ ప్రక్రియను ఈనెల 15 వ తేదీ లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. తమ కార్యాలయ సిబ్బందికి, కార్మికులకు సమీపంలోని అర్బన్ హెల్త్ సెంటర్లలోగానీ ఆసుపత్రులలో గాని వాక్సినేషన్ ఇప్పించేవిధంగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ప్రతిరోజూ వాక్సిన్ వేసుకున్న వారి వివరాలు ప్రధాన కార్యాలయానికి పంపడంతో పాటు ఈ వివరాలను కోవిద్ పోర్టల్ లో అప్లోడ్ చేయాలని కోరారు.. జీహెచ్ఎంసీ లో వివిధ స్తాయిలో దాదాపు 30 వేల మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉన్నారని, వీరిలో ఏఒక్కరిని మినహాయింపు లేకుండా అందరికి వాక్సిన్ వేయించాలని స్పష్టం చేశారు.
కరోనా కట్టడిలో భాగంగా 15 వ తేదీ తర్వాత ప్రతిఒక్కరు అధికారి, సిబ్బంది విధిగా వాక్సిన్ వేసుకొనే కార్యాలయానికి రావాలన్నారు. కరోనా కట్టడిలో భాగంగా వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే సందర్శకులు కూడా వాక్సిన్ వేసుకొని రావాలని చైతన్య పర్చాలని కమీషనర్ సూచించారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తదితర కోవిద్ నిబంధనలను కచ్చితంగా పాటించేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా కట్టడిలో మరోసారి చురుకైన పాత్ర వహించాలని జీహెచ్ ఎంసీ అధికారులను కోరారు.