నటీనటులు: రానా దగ్గుబాటి, విష్ణు విశాల్, జోయా హుస్సేన్ తదితరులు
దర్శకత్వం : ప్రభు సాల్మన్
నిర్మాతలు: ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ
మ్యూజిక్ : శాంతను మొయిత్రా
విడుదల తేది : మార్చి 26, 2021
తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5
భల్లాల దేవా గా వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయినా రానా..తాజాగా మరో పాన్ ఇండియా మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రభు సోలొమన్ దర్శకత్వంలో హిందీలో ఘన విజయం సాధించిన హతి మేరె సాతి స్ఫూర్తితో తెరకెక్కిన ఈ చిత్రం అరణ్య పేరుతొ ఈరోజు తెలుగు, తమిళ్ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది..కథ ఏంటి..అసలు అరణ్య ఎవరు అనేది చూద్దాం.
కథ :
నరేంద్ర భూపతి అలియాస్ అరణ్య(రానా ) ప్రకృతి ప్రేమికుడు. అడవులు, వన్యప్రాణులు అంటే ఎంతో ఇష్టపడే ఈయన..తన తాతలు 500 ఎకరాల అడవిని ప్రభుత్వానికి రాసిచ్చెస్తే… ఆయన ఆ అడవికి, అక్కడి వన్యప్రాణులకు సంరక్షకుడిగా ఉంటాడు. అడవులు పెరగడానికి కారణం ఏనుగులని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యతపై మనపై ఉందని చెబుతుంటాడు. లక్షకు పైగా మొక్కలు నాటి రాష్ట్రపతి చేతుల మీదుగా ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అవార్డు అందుకుంటాడు. అందుకే, నరేంద్ర భూపతిని అక్కడి గిరిజన ప్రజలు అరణ్యగా పిలుచుకుంటారు.
ఇదిలా ఉంటే.. అటవీ శాఖ మంత్రి కనకమేడల రాజగోపాలం(అనంత్ మహేదేవన్) ఆ అడవి స్థలంపై కన్నుపడుతుంది. అక్కడ డీఆర్ఎల్ టౌన్‌షిప్‌ని నిర్మించాలని భావిస్తాడు. దీని కోసం 60 ఎకరాల అడవిని నాశనం చేయాలనుకుంటాడు. మరి అరణ్య దానిని ఎలా అడ్డుకుంటాడు.. ? అడవిని, ఏనుగులను అరణ్య ఎలా కాపాడాడు? అనేదే అసలు కథ.
ప్లస్ :
- రానా యాక్టింగ్
- కథ
- విజువల్స్
- నేపథ్య సంగీతం
- మైనస్
- కథనం
- సాగదీత సీన్లు
నటీనటుల తీరు :
- కెరీర్ ప్రారంభం నుంచే రానా వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంటాడు. పాత్ర ఏదైనా అందులో పరకాయప్రవేశం చేసి ఆకట్టుకుంటాడు. ఇందులో కూడా అరణ్య పాత్రలో అదరగొట్టాడు. అరణ్య పాత్ర కోసం రానా పడిన కష్టమంతా సినిమాలో కనిపిస్తుంది.అడవి మషినిలా ఉండే అరణ్య పాత్రలో రానా జీవించేశాడు. ఆఖరికి ఫైట్ల విషయంలోనూ ఎంతో శ్రద్ధ తీసుకుని తన ప్రత్యేకతను చాటుకున్నారు. సినిమాకు మూలస్తంభంగా నిలిచారు.
- విష్ణు విశాల్ పాత్ర పరిచయం గొప్పగా ఉన్నా అందులో పసలేదు. శ్రియా పిల్గోంకర్, జోయా హుస్సేన్ పాత్రల పరిస్థితి అంతే. అనంత్ మహదేవన్ విలన్ పాత్రకు న్యాయం చేశారు. రఘుబాబు కామెడీ అంతగా పండలేదు.
- మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
సాంకేతిక వర్గం :
- సినిమాటోగ్రాఫర్ ఎ.ఆర్. అశోక్ కుమార్ పనితనం గురించి ఎంత చెప్పిన తక్కువే. థాయిలాండ్ అడవులను తన కెమెరాలో అద్భుతంగా బంధించారు. ఎక్కువ శాతం షూటింగ్‌ని అడవి ప్రాంతంలోనే జరిపారు. అడవి అందాలని తెరపై చక్కగా చూపించారు. థియేటర్లో ఉన్నామా లేదా అడవిలో ఉన్నామా అనే భావన ప్రేక్షకుడికి కలుగుతుంది. అశోక్ కుమార్ కష్టం ప్రతీ ఫ్రేమ్‌లో కనిపిస్తుంది.
- ఇక ఈ సినిమాకు మరో ప్రధాన బలం శాంతను మొయిత్రా మ్యూజిక్. పాటలు అంతంత మాత్రమే అయినా.. నేపథ్య సంగీతం అదిరిపోయింది. కొన్ని సీన్లకు తన బీజీఎంతో ప్రాణం పోశాడు.
- రసూల్ పూకుట్టి చేసిన సౌండ్ ఎఫెక్ట్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. ఎడిటర్ భువన్ శ్రీనివాసన్ చాలా చోట్ల తన కత్తెరకు పనిచెప్పాల్సింది.
- నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి.
- ఇక డైరెక్టర్ ప్రభు విషయానికి వస్తే..ప్రేమఖైదీ’, ‘గజరాజు’వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ ఈ సబ్జెక్ట్‌ని ఎంచుకోవడంతో ‘అరణ్య’పై అంచనాలు పెరిగాయి. అయితే ఆ అంచనాలను దర్శకుడు అందుకోలేకపోయాడు. కథ బాగున్నా.. తెరపై చూపించిన విధానం బాగాలేదు. బలమైన కథను ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు విఫలమయ్యాడు. పాత్రల పరిచయం వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత కథ, కథనాన్ని ఎటో తీసుకెళ్లాడు.
నక్సలైట్ల ప్రస్తావన, ఒక మహిళా నక్సలైట్‌ను మావటి సింగా (విష్ణు విశాల్) ప్రేమించడం వంటి అంశాలకు దర్శకుడు న్యాయం చేయలేదు. సినిమా నిడివి పెంచడానికే ఈ సన్నివేశాలు అన్నట్టు ఉన్నాయి. రానా, ఏనుగుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా పెద్దగా ఆకట్టుకోవు. చాలా సాదా సీదాగా అనిపిస్తాయి. ట్విస్టులు ఏమీ లేకుండా సినిమా ను తీసుకెళ్లడం పెద్ద మైనస్.
ఫైనల్ : పసలేని అరణ్య.