సినిమా కూడా వ్యాపారమే. సినిమాకు తీయడం, అమ్ముకోవడం , మంచి కధలు కొనడం, సూపర్ హిట్ సినిమాల రైట్స్ దక్కించుకోవడం, డబ్బింగ్ సినిమా తీసుకోవడం .. ఇలా ప్రతిది వ్యాపారమే. ఈ వ్యాపారం చక్కగా చేసి డబ్బుతో పాటు పేరు కూడా దక్కించుకునే వారు ఇండస్ట్రీలో చాలా మందే వున్నారు. ఇందులో దిల్ రాజు పేరు కూడా చేర్చవచ్చు.డిస్స్టిబ్యుటర్ గా మొదలైన ఆయన ఈ రోజు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ నిర్మాత. దిని వెనుక దిల్ రాజు తెలివి తేటలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఆయన మరో తెలివైన నిర్ణయం తీసుకున్నారు. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన నాంది సినిమాకు అన్ని వైపుల మంచి అప్లాజ్ వచ్చింది.
ఇప్పుడు దిల్ రాజు నాంది అనువాదపు హక్కులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇతర భాషల్లో నాందిని అనువాదం చేయడానికి, రీమేక్ చేయడానికి లేదా అనువాదం చేసి డిజిటల్ విడుదల చేయడానికి వీలైన హక్కులను రెండు కోట్లకు పైగా చెల్లించి దిల్ రాజు కొనుగోలు చేసారని వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఇది చాలా సరసమైన ధర అని చెప్పాలి. నాంది బాలీవుడ్ లో కూడా ఆడే దమ్మున్న కధ. న్యాయ శాస్త్రం ఆధారంగా వచ్చింది కాబట్టి దేశ వ్యాప్తంగా ఈ సినిమా నప్పుతుంది. బాలీవుడ్ లో తీసుకెళ్తే హిట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా వున్నాయి కాబట్టి దిల్ రాజు పంట పండినట్లే.