నాలుగు కథల్ని పోగుచేసి రూపొందించిన వెబ్‌సిరీస్ ‘పిట్టకథలు’. దీన్ని ప్రముఖ దర్శకులు నందినీ రెడ్డి, తరుణ్ భాస్కర్, నాగ్ అశ్విన్, సంకల్ప్ రెడ్డి తెరకెక్కించారు. శ్రుతిహాసన్, అమలాపాల్, జగపతిబాబు, సత్యదేవ్ , మంచు లక్ష్మి, ఈషా రెబ్బా, శాన్వి మేఘన తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన… తొలి తెలుగు ఆంథాలజీ ఇది. నలుగురు వర్థమాన దర్శకులు… తయారు చేసుకున్న `పిట్ట కథలు`కావడంతో వీటిని చూడ్డానికి తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదరు చూశారు.
ఇందులో మొదటి కధ ‘రాముల’ తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన కథ ఇది. తెలంగాణ నేపధ్యంలో సాగిన ఈ కధ ఇది. మరీ అంత గొప్పగా అనిపించకపోయిన ఓకే మార్కులు పడతాయి ఈ కధకు. ఐతే తరుణ్ కు ఇంతకంటే మంచి కధ దొరకలేదా అనే ఫీలింగ్ కలుగుతుంది ఆయన ఫ్యాన్స్ కు. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన కథ ‘మీరా’. మీరా (అమలాపాల్), విశ్వ (జగపతిబాబు) భార్యా భర్తలు. విశ్వకి మీరాపై అనుమానం ఎక్కువ. వాళ్ల ఈగో క్లాష్‌లు, అనుమానాలూ ఎంత వరకూ వెళ్లాయన్నదే మీరా కథ. ఐతే భర్తకు బుద్ధి చెప్పడానికి దర్శకురాలు ఎంచుకున్న మార్గం మాత్రం అంతగా కన్విన్సింగ్ గా వుండదు. ఈ కధకు కూడా పాస్ మార్కులు పడతాయి.
నాగ అశ్విన్ దర్శకత్వం వహించిన కధ ఎక్స్ లైఫ్. ఈ కధ కొత్తగా ఉంటుంది. మనుషుల్ని ఓ ఊహా జనితమైన ప్రపంచంలోకి తీసుకెళ్ళే టెక్నాలజీ వెరైటీగా వుంటుంది. ఐతే ఈ పాయింట్ అంతగా అర్ధం కాదు. కొంచెం కన్ప్యుజ్ గా సాగుతుంది. చివరి కధ పింకీ. ఘాజీ లాంటి డీసెంట్ సినిమా అందించిన సంకల్ప్ రెడ్డి… ఈ కథకు దర్శకత్వం వహించాడు. రెండు జంటల కథ ఇది. విడాకుల తరవాత కూడా మొదటి భర్తపై ప్రేమ తగ్గక… తనకు దగ్గరవ్వాలనుకునే ఓ గృహిణి కథ. ఈ పాయింట్లో కూడా ఓవర్ వెరైటీ వుంది. మొత్తంగా చూసుకుంటే బాలీవుడ్ లో లస్ట్ స్టోరీస్ లాంటి సిరిస్ అవుతుందని ఆసక్తి రేపిన పిట్టకధలు.. మరీ అంతగా కాకపోయినా మాస్ మార్కులు మాత్రం వేసుకుంటాయి.