నాగ్ రుసరుసలకు కారణం ఏమిటి?

nagఎప్పుడూ సౌమ్యంగా మాట్లాడే గ్రీకువీరుడు, మొహం మీద చిరునవ్వు చదిరిపోని.. నాగార్జునుడు మొదటిసారి కాస్త అదుపుతప్పి మాట్లాడాడు. ‘గ్రీకువీరుడు’ ఆడియో వేడుకలో ‘పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు..’ అని
హెచ్చరించాడు. అదంతా.. ఆయన రిటైర్మెంట్ గురించే. ‘ఎవరో అడిగారు ఈ మధ్య.. ఎప్పుడు రిటైర్ అవుతారు? అని.. ‘ కాస్త వ్యంగ్యంగా మొదలెట్టి..’అఖిల్, చైతన్య రిటైర్ అవుతారేమోగానీ, నేను మాత్రం కాను..’ అంటూ ఝులక్ ఇచ్చారు. సడన్ గా ఈ రిటైర్ మెంట్ ప్రస్తావన ఇప్పుడెందుకు వచ్చింది? ఈ విషయంలో నాగ్
ని కెలికింది ఎవరు? ఆ వేడుకలో ఈ టాపిక్ ఎందుకు తీసుకొచ్చాడు? అనేదే ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్న అంశాలు.

నిజానికి నాగ్ రిటైర్ మెంట్ గురించి మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. ‘తనయుడు హీరో అయ్యాడు కదా? ఈ సమయంలో పక్కకు తప్పుకొంటే బెటర్..’ అనేది ఆ కథనాల సారాంశం. నాగ్ ఒక్కడి గురించే కాదు.. అగ్ర కథానాయకులు చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణలపై కూడా ఇదే రకమైన వార్తలు వచ్చాయి. చిరంజీవి రాజకీయాల్లో సెటిలైపోయారు. బాలకృష్ణ తనయుడు తెరపై రావల్సివుంది. వెంకటేష్ కి మరో రెండు మూడేళ్ల వరకూ నటించే స్కోప్ ఉంది. అందుకే మీడియా నాగ్ ని టార్గెట్ చేసింది. ఈ మధ్య కొన్ని ఇంటర్వ్యూలలో ‘మీరెప్పుడు రిటైర్ అవుతారు?’ అని నాగ్ ని కొంతమంది పాత్రికేయులు నేరుగా అడిగేస్తున్నారు. దాంతో నాగ్ కి కోపం వచ్చింది. అందుకే తన అసహనాన్ని వేదికపై వెల్లగక్కాడు. 

అంతేకాదు… వంద సినిమాలపై నాగ్ దృష్టి పడింది. ప్రస్తుతం ఆయన స్కోరు తొంభై. ఎవరికైనా సెంచరీపై మోజు ఉంటుంది కదా? త్వరితగతిన ఆ మార్కు చేరుకొని, ఆ తరవాత సినిమాలకు స్వస్తి చెప్పాలనేది నాగ్ వ్యూహం కావచ్చు. ఈలోగా.. చైతన్య కెరీర్ కూడా ఓ గాడిలో పడే అవకాశం ఉంది. నిఖిల్ రంగప్రవేశం కూడా జరిగిపోతుంది. వీరిద్దరి కెరీర్ ని ఆస్వాదిస్తూ గడిపేయాలనేది నాగ్ ఆలోచన. అంతేకాదు.. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలను కూడా తనే దగ్గరుండి చూసుకొంటున్నారు. ఫిల్మ్ ఇనిస్ట్యూట్ అభివృద్ధి కోసం సమయం కేటాయిస్తున్నారు. రిటైర్మెంట్ తరవాత.. ఆయన పూర్తిగా వీటికే పరిమితం అయ్యే అవకాశాలున్నాయి.

ఈలోగా వీలైనన్ని మంచి సినిమాలు చేయాలనేది నాగ్ ఆలోచన. ఎంట్రీ, ఎగ్జిట్ ల గురించి తెలిసిన వాడే నిజమైన నటుడు… అంటుంటారు. ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నాగ్ కి బాగా తెలుసు. అది ఆయనకే వదిలిపెడితే మంచిది.