శ్రీలక్ష్మీకి ఒక న్యాయం-సబితకు మరోన్యాయమా?

sbita-and-srilakshamiఒకటే కుంభకోణం. కానీ దీని కోణాలు అనేకం. జగన్ అక్రమాస్తుల కేసులో గనుల కేటాయింపు శాఖకు సబితా ఇంద్రారెడ్డి. ఆమె అదుపాజ్ఞలో పనిచేసే అధికారిణి శ్రీలక్ష్మీ. కేసులో మంత్రిగారి నెంబరు నాలుగు. అధికారిణి నెంబరు అయిదు. కానీ మంత్రిగారు బయటే ఉన్నారు. అధికారిణి మాత్రం జైల్లో మగ్గి మగ్గి, అనారోగ్యం పాలై, ఆఖరికి బెయిల్ పై బయటకు వచ్చి, మంచాన పడ్డారు. ఈ సంఘటన మన ప్రజాస్వామ్య దేశపు వ్యవస్థలో వున్న లొసుగులకు అద్దం పడుతుంది. అధికారంలో వున్నవారి ప్రాపకం వుంటే ఒకలా, లేకుంటే మరోలా అన్న సత్యం
ఇలాంటి సమయాల్లోనే రుజువవుతూ ఉంటుంది. మనదేశంలో ఆమాత్యుల కనుసైగ లేకుండా ఫైలు కదలదన్నది, అనుమతుల లభించవన్నది నిత్యసత్యం. అటువంటప్పుడు సబిత సంతకాలు, అనుమతులు, లేకుండానే శ్రీలక్ష్మీ వ్యవహరించారా? గతంలో శ్రీలక్ష్మీ ఈ విషయమై కోర్టుకు తన బాధ విన్నవించుకున్నారు కూడా. అయినా అప్పట్లో ఎవరికీ పట్టలేదు. ఇప్పుడు సిబీఐ చార్జిషీట్ దాఖలు చేశాక అందరి కళ్లు సబిత వైపు తిరిగాయి. చిత్రమేమిటంటే, శ్రీలక్ష్మీ కింద వుండి, తన పైనున్న సబిత వైపు వేళ్లు చూపిస్తే, తప్పించుకోవడానికి అన్నారు. మరి ఇప్పుడు సబిత మాత్రం ముఖ్యమంత్రి వైఎస్ ఎలా చెబితే అలా చేసినట్లు కథనాలు, వార్తలు అల్లుతున్నారు. అంటే వైఎస్ చెప్పినట్లు సబిత చేసి వుంటే, శ్రీలక్ష్మీ కూడా వైఎస్ చెప్పినదే, సబిత చెబితే చేసినట్లు అని ఎందుకు అనుకోకూడదు. ఇదంతా శ్రీలక్ష్మీని వెనుకేసుకురావడానికి కాదు. న్యాయం, శిక్ష, కోర్టు విచారణ పద్ధతులు అందరికీ ఒకే విధంగా వుండాలన్నది మాత్రమే. అధికారులను సిబిఐ కార్యాలయానికి పిలిచి విచారిస్తారు. మంత్రులను వారి వద్దకే వెళ్లి ప్రశ్నిస్తారు. దీనిపై గతంలో ఐఎ ఎస్ లు గొంతెత్తారు కూడా. సబితను, ధర్మానను పదవుల్లో కొనసాగుతూనే విచారణ ఎదుర్కోమని చెప్పి, న్యాయ సహాయం కూడా అందించిన ప్రభుత్వం అధికారుల దగ్గరకు వచ్చేసరికి అలా ఎందుకు చేయదు? కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల, అధికారుల సంక్షేమం బాగా చూస్తుందని అంటారు. అంటే ఇదేనా?