బ్రిటన్ లో కొత్తరకం కరోనా వైరస్

బ్రిటన్ లో కరోనా సెకండ్ వేవ్ మొదలైన నేపథ్యంలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. తొలినాళ్లలో వ్యాపించిన కరోనా వైరస్ రకంతో పోల్చితే రెండోసారి వ్యాపిస్తున్న వైరస్ ఎంతో భిన్నమైనదని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం లండన్ లో వ్యాప్తి చెందుతున్నది కరోనా వైరస్ కొత్తరకం అని వెల్లడించారు. ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో, పలు ప్రాంతాల్లో కేవలం వారం రోజుల్లోనే కేసులు రెట్టింపయ్యాయని బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రి మాట్ హాంకాక్ తెలిపారు.

కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉండడంతో టైర్-3 ఆంక్షలు విధించినట్టు వివరించారు. ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్న నేపథ్యంలో కఠిన ఆంక్షలు తప్పవని స్పష్టం చేశారు. ఈ మార్పులకు లోనైన ఈ నూతన రకం కరోనా వైరస్ పై ఇప్పుడొస్తున్న వ్యాక్సిన్లు ప్రభావం చూపకపోవచ్చని హాంకాక్ అభిప్రాయపడ్డారు.