జగన్ రంగు బయటపడింది

ఏపీ సిఎం జగన్‌పై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. రసాయన పరిశ్రమల ఏర్పాటును తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. కోనసీమ ప్రాంత ప్రజల ప్రయోజనాలను దృష్ట్యా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ రసాయన పరిశ్రమల వల్ల సముద్ర జలాలు కలుషితమై మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

భూములన్నీ ఉప్పు తేలడంతో రైతులకూ నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 300పైగా హేచరీలు కూడా కాలుష్యంలో చిక్కుకుంటాయని, దీంతో చిరు వ్యాపారులకు కూడా నష్టం వాటిల్లుతుందని చెప్పారు. చేపల వేట లేకపోతే ఫిషింగ్ హార్బర్‌ ప్రతిపాదన అంతా పచ్చి మోసమేనని ఆయన పేర్కొన్నారు. బల్క్‌ డ్రగ్‌ పరిశ్రమ ఏర్పాటునూ తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు.

రసాయన పరిశ్రమ ఏర్పాటు ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని అన్నారు. గతంలో వైసీపీ కూడా దివీస్‌ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకించిందని ఆయన చెప్పారు. ఇప్పుడు మాత్రం దానికి అనుమతి ఇచ్చిందని, దీంతో ఆ పార్టీ అసలు రంగు బయటపడిందని తెలిపారు.