‘బాద్ షా’ పండగ రేపే

BADSHAH-festivel-from-tomma‘బాద్ షా’ ఫీవర్ అంతటా పాకేసింది. ఏ ఇద్దరు మాట్లాడుకున్న చివరికి టాపిక్ బాద్ షా పైకే మళ్లుతుంది. ఎన్టీఆర్ ఎన్ని మ్యాజిక్ లు చేస్తాడనేదే అందరి చర్చ. ఇది వరకు ఎన్టీఆర్ సినిమాలెన్నో వచ్చాయి. కానీ దేనికీ.. ఇంత హైప్ రాలేదు. ‘బాద్ షా’ అంత క్రేజ్ దక్కించుకోవడానికి కారణాలు చాలానే ఉన్నాయ్! అటు రాజకీయ నాయకులూ.. ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో శుక్రవారం నుంచీ థియేటర్ల దగ్గర పండగ మొదలుకాబోతుంది. వారం రోజుల ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్ లు మొదలైపోయాయి. టికెట్టు లేకుండా థియేటర్ కి వెళ్లకండి. ఎందుకంటే.. హౌస్ ఫుల్ బోర్డులు వెక్కిరిస్తాయి. మరో వారం రోజులు రాష్ర్టమంతా ఇదే పరిస్థితి. మల్టీప్లెక్స్ బుకింగులు ఏనాడో క్లోజ్ అయిపోయాయి. బాద్ షా ఫీవర్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు మాత్రమే!

రూ. 55 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రమిది. సినిమా విడుదలకు ముందే.. బండ్ల గణేష్ ఈ సినిమాకి టేబుల్ ప్రాఫిట్ కి అమ్మేశాడు. ఇంత పెద్ద బడ్జెట్ తో తీసిన సినిమాకి టేబుల్ ప్రాఫిట్ దక్కడం నిజంగా అరుదైన విషయమే. శాటిలైట్ రేట్ కూడా.. దిమ్మతిరిగిపోయింది. అటు ఓవర్సీస్ లోనూ ఎన్టీఆర్ హంగామా సృష్టిస్తున్నాడు. దాదాపు 210 థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ ప్రింట్ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఓ దక్షిణాది చిత్రం ఇంత భారీ స్థాయిలో విడుదల కావడం ఇదే ప్రథమం. ఓవర్సీస్ లో దూకుడు, గబ్బర్ సింగ్ సాధించిన రికార్డులను బాద్ షా తిరగరాస్తుందని నందమూరి అభిమానులు బల్లగుద్ధి మరీ చెబుతున్నారు. ఓవర్సీస్ అనే మాటేంటి? ఇక్కడా.. అదే పరిస్థితి. దాదాపు పదిహేను వందల థియేటర్లలో బాద్ షా విడుదల అవుతోంది. తొలివారం టికెట్లు అప్పుడే అమ్ముడైపోయాయి. ఈ సినిమా విడుదలకు ముందే హిట్ అని చెప్పడానికి ఇంకేం కావాలి? ఎన్టీఆర్ సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పడానికి బాద్ షా నే ఓ ఉదాహరణ.

ఈ సమ్మర్ లో చాలా పెద్ద సినిమాలొస్తున్నాయి. వాటికి బాద్ షా నాంది పలకబోతున్నాడు. బాద్ షా సాధించిన హిట్ రేంజ్ ని బట్టే తదుపరి సినిమాల విడుదల తేదీ ఖరారు కానున్నాయి. ఈ నెల 11న వచ్చేదామనుకొంటున్న ‘షాడో’ తటపటాయిస్తున్నాడంటే కారణం.. ‘బాద్ షా’నే. విడుదలకు ముందే రికార్డులు బద్దలుకొట్టిన ఎన్టీఆర్.. శుక్రవారం నుంచి ఇంకెన్ని కొత్త రికార్డులు సృష్టిస్తాడో అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మార్చి నెల తెలుగు సినిమా పరిశ్రమకు కలసి రాలేదు. ఆ లోటు వడ్డీతో సహా బాద్ షా తీర్చేస్తాడనేది అందరి నమ్మకం. అది నిజం కవాలి. మరోసారి బాక్సాఫీసు కళకళలాడాలి. అది బాద్ షా వల్లే జరగాలి. ఆల్ ది బెస్ట్.. ఎన్టీఆర్ !