మరికాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు

మరికాసేపట్లో ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. తొలి రోజు 11 ఆర్డినెన్స్‌లను ప్రభుత్వం సభ ముందుకు తీసుకురానుంది. వీటితోపాటు మరికొన్ని కొత్త చట్టాలు, చట్టసవరణలకు సంబంధించిన 30 బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు పనులు, నాడు-నేడు పనితీరు, సంక్షేమ కార్యక్రమాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని అధికారపక్షం సభ ద్వారా ప్రజలకు వివరించనుంది.

ఈసారి ఉభయ సభలు ఎన్ని రోజుల పాటూ సమావేశం అవుతాయనే అంశాన్ని తొలి రోజు జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తారు. ఇదిలా ఉంటే ఈ సెషన్స్‌లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యూహాలు సిద్ధం చేసింది. అందుకే ముందుగా మండలి ఛైర్మన్‌కు టీడీపీ ఎమ్మెల్సీలు పర్చూరి అశోక్ బాబు, బుద్దా వెంకన్న, మంతెన వెంకట సత్యనారాయణ రాజు లేఖ రాశారు. శాసనమండలి శీతాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాలను, స్వల్పకాలిక చర్చకు అనుమతించాలని.. సభ్యుల హక్కలను కాపాడాలని మండలి ఛైర్మన్‌ను కోరారు. .
సభను సజావుగా జరిపేందుకు చర్యలు తీసుకోవాలి. కోవిడ్ పేరుతో ప్రశ్నోత్తరాల సమయం లేకుండా తప్పించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని.. ప్రజా సమస్యలను లేవదీసి ప్రజలకు న్యాయం చేసేందుకు ప్రశ్నోత్తరాల సమయానికి అనుమతి ఇవ్వాలని కోరారు.