ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పటి వరకు 87 వేలకు పైగా పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలను జిహెచ్ఎంసి తొలగించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో వచ్చినప్పటి నుండి నేటి వరకు 12,500 బ్యానర్లు, 16,040 పోస్టర్లు, 4,231 బోర్డులు, 16,977 ఫ్లెక్సీలు, 37,650 ఫ్లాగ్ లు తొలగించినట్టు జిహెచ్ఎంసి ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం డైరెక్టర్, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు నోడల్ అధికారి విశ్వజిత్ కంపాటి తెలిపారు. నేడు ఒక్కరోజే 485 బ్యానర్లు, 2844 పోస్టర్లు, 71 బోర్డులు, 1300 ఫ్లెక్సీలు, 3,983 ఫ్లాగ్ లను తొలగించినట్టు తెలిపారు. నగరంలో అనుమతిలేకుండా వివిధ పార్టీలు, నాయకులు ఏర్పాటు చేసిన ప్లెక్సీలు, బ్యానర్లను తొలగించేందుకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. నేడు తొలగించిన ప్లెక్సీలు, బ్యానర్లలో ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు, ప్రహరీగోడలు, ప్రధాన రహదారుల వెంట తొలగించినట్లు పేర్కొన్నారు.
నగరంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయడానికి సర్కిళ్లవారిగా నిఘా బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని విశ్వజిత్ కంపాటి వివరించారు.