రాష్ట్రంలో అన్ని రకాల వ్యర్థ పదార్థాల నిర్వహణ పై త్వరలోనే సమగ్ర ప్రణాళికను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. జీడిమెట్లలో ఏర్పాటుచేసిన 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ ను నేడు ప్రారంభించారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సుంకరి రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద, రాంకీ ఎన్విరో సి.ఇ.ఓ గౌతం రెడ్డి, శానిటేషన్ విభాగం అదనపు కమిషనర్ రాహుల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కె.టి.ఆర్ మాట్లాడుతూ…రాష్ట్రంలో ద్రవ వ్యర్థాలు, జీవ వ్యర్థాలు, మల వ్యర్థాలు, భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణపై ఇప్పటికే ప్రత్యేక శుద్ది కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. నగరంలో రోజు 2వేల మెట్రిక్ టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలు వస్తున్నాయని, జీడిమెట్లలో ఏర్పాటు చేసిన రీసైక్లింగ్ ప్లాంట్ ద్వారా రోజుకు 500 టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయనున్నట్లు తెలిపారు. మరో 500 టన్నుల సామర్థ్యం గల రీసైక్లింగ్ ప్లాంట్ ను త్వరలోనే ఫతుల్లగూడలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. నగరంలో భవన నిర్మాణ వ్యర్థాలను తరలించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని, ఎక్కడైన భవన నిర్మాణ వ్యర్థాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1800-1200-72659 అనే నెంబర్ కు ఫోన్ చేయాలని కె.టి.ఆర్ తెలిపారు. జీడిమెట్లలో ప్రారంభించిన భవన నిర్మాణ వ్యర్థాల ప్లాంట్ దక్షణ భారతదేశంలో అతిపెద్దది, అత్యాధునికమని వెల్లడించారు. వ్యర్థాల నిర్వహణలో హైదరాబాద్ నగరం దేశంలోనే ఆదర్శంగా ఉందని అన్నారు. జవహర్ నగర్ లో 6 వేల టన్నుల మున్సిపల్ వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేసే వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ ను మరికొన్ని రోజుల్లోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. నగరంలో రోజుకు 2 వేల మిలియన్ లీటర్ల వ్యర్థ జలాలు విడుదలవుతున్నాయని, వీటిలో 41 శాతం జలాలను సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్దిచేసి మూసిలోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ…17 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన జీడిమెట్ల భవన నిర్మాణ వ్యర్థాల ప్లాంట్ దేశంలోనే 5వ అతిపెద్ద ప్లాంట్ అని తెలిపారు. నగరంలో ఎక్కడ కూడా భవన నిర్మాణ వ్యర్థాలు కనబడకుండా చర్యలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. జవహర్ నగర్ లో నిర్మించిన వేస్ట్ టూ ఎనర్జీ విద్యుత్ ప్లాంట్ ను వచ్చే వారం ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నగర మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ…హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణ వ్యర్థాలు లేకుండా చర్యలు చేపట్టామని, దీనిలో భాగంగానే హైదరాబాద్ నలుదిక్కులా నాలుగు రీసైక్లింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నేడు ప్రారంభించిన జీడిమెట్ల ప్లాంట్ తో పాటు ఫతుల్లగూడ లో నిర్మించిన భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. జీడిమెట్లలో ఏర్పాటు చేసిన ఈ రీసైక్లింగ్ ప్లాంట్ ను అత్యాధునిక పరికరాలతో నిర్మించడం జరిగిందని తెలిపారు. పర్యావరణ హితంగానూ ఉన్న ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయిన పదార్థాలను పేవర్ బ్లాక్ లు, టైల్స్, ప్రీ కాస్టింగ్ వాల్స్ తయారు చేస్తున్నట్లు మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మంత్రి సత్యానారాయణ, జగన్, జోనల్ కమిషనర్లు మమత తదితరులు పాల్గొన్నారు.