”టీఆర్ఎస్ ప్రభుత్వం వరద సహాయ పంపిణీలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడింది. దొంగలు దొంగలు కలసి దేశాలు పంచుకున్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు,వార్డ్ లీడర్లు, జీహెచ్ఎంసీ అధికారులు వీళ్ళంతా కలసి వరద సహాయ నిధి దోచుకున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైట్ కాలర్ క్రైమ్ కి పాల్పడ్డారు” అని కాంగ్రెస్ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ ఆరోపించారు. వరద సహాయం పంపిణీలో జరుగుతున్న అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని ఆయన తెలంగాణ హైకోర్ట్ ని ఆశ్రయించి పిల్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ…వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైయింది. వరదల్లో లక్షలమంది నష్టపోయారు. కొందరు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. నష్టపోయిన ప్రతి ఇంటికి యాబై వేల రూపాయిలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశాం. కానీ ఎంగిలి మెతుకులు వేసినట్లుగా పదివేలరూపాయిలే ఇస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. కూలిపోయిన ఇంటికి లక్ష రుపాయిలే ఇస్తాం, పాక్షికంగా కూలిపోయిన ఇంటికి రూ. 50 వేలు ఇస్తామని కేసీఆర్ ప్రభుత్వం ఒంటెద్దు పోకడగా వ్యవహరించింది. సరే.. ఈ సాయమన్నా ప్రజలందరికీ చేరవేస్తారేమో అన్న ఆశతో ఎదురు చూశాం. కానీ దొంగలు దొంగలు కలసి దేశాలు పంచుకున్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు , కార్పొరేటర్లు, వార్డ్ లీడర్లు, జీహెచ్ఏం సీ అధికారులు వీళ్ళంతా కలసి వరద సహాయ నిధి దోచుకున్నారు. దుర్మార్గంగా అడ్డగోలుగా వరద సాయాన్ని జేబులో వేసుకున్నారు.” అని ఆరోపించారు.
”వరద సాయం ఇస్తున్నట్లు వ్యవహరించి మరో పక్క జీహెచ్ఎంసి ఎన్నికలని ప్రజలపై దుద్దే కుట్ర జరుగుతుంది. వార్డుల వారీగా ఎలక్ట్రాల్ రోల్స్ ప్రిపరేషన్ కి నోటిఫికేషన్ రావడం అందులో భాగమే’ అని మండిపడ్డారు. ”చాలామంది ప్రజలు అసలు పైసా సాయం కూడా అందలేదు. ‘వరద సహాయ నిధిని టీఆర్ఎస్ ప్రభుత్వం దారి మళ్లించింది. కొన్ని చోట్ల పది వేల రూపాయిలు ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ దాని నుండి టీఆర్ఎస్ కమీషన్ ఏజెంట్లు కమీషన్లు గుంజుకుంటున్నారు. ఇలా దోపిడీ జరుగుతుంది. టీఆర్ఎస్ నేతలు అధికారం అడ్డుపెట్టుకొని దుర్మార్గంగా నీచమైన అవినీతికి పాల్పడుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరగాలి” అని ఇవాళ గాంధీ భవన్ లో మాట్లాడుతూ పేర్కొన్నారు.
”’డబ్బులు వితరణపై లెక్కా పత్రం లేదు. టీఆర్ఎస్ కండువాలు కప్పుకొని లీడర్లు డబ్బులు పంచుతున్నారు. ఈ డబ్బు ఎవరిది ? సీఎం రిలీఫ్ ఫండ్ అంటే కేసీఆర్ జాగీరా ? సీఎం రిలీఫ్ ఫండ్ అంటే పబ్లిక్ మనీ. సీఎం రిలీఫ్ ఫండ్ కి డబ్బు వస్తే అది కేసీఆర్ మొహం చూసి ఇచ్చింది కాదు. సీఎం రిలీఫ్ ఫండ్ లోని డబ్బు.. ఆ కుర్చీలో కూర్చున్నది ఎవరైనా సరే ప్రజలను ఆదుకోవడమే లక్ష్యం. అందులో వున్న ప్రతి పైసాకి అకౌంటబిలిటీ వుండాలి. ఆడిట్ వుండాలి. అలాంటిది టీఆర్ఎస్ లీడర్లు ఆ డబ్బుని అడ్డగోలుగా ఎలా డ్రా చేశారు ? పార్టీ కండువాలు కప్పుకొని బాబుగారి సొత్తు అన్నట్టు ఎలా పైసలు అడ్డగోలుగా పంచారు. అసలు ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ ఉందా ? ఛీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నారు ? జీహెచ్ఎంసీ కమీషనర్ వున్నారా ? ఎంతో నిబద్దత గల వృత్తుల్లో వున్న ఐఏఎస్ అధికారులు కూడా టీఆర్ఎస్ ఏజెంట్లుగా మారిపోయి దొంగ చేతిలో తాళాలు పెట్టినట్లు వాళ్లకు డబ్బులు ఇస్తారా? వాళ్ళతో సాయం పంపిణీ చేయిస్తారా? అర్హులైన బాదితులకు సాయం అందకుండా నిస్సిగ్గుగా టీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా డబ్బులు పక్కదారి పట్టిస్తుంటే .. ఈ చిల్లర రాజకీయాల్ని అధికారులు దగ్గర వుండి ప్రోత్సహించడం దారుణం. ప్రజలు కూడా ఈ దుర్మార్గాన్ని ప్రశ్నించాలి” అని కాంగ్రెస్ సీనియర్ నేత కోరారు
”కేసీఆర్ సర్కార్ కి అసలు స్పృహ లేదు. చరిత్రలో ఎన్నడూ లేని విదంగా వరదలు వచ్చాయి. కానీ ఈ వరదల్లో కూడా బురద రాజకీయాలు మానుకోలేదు కేసీఆర్ సర్కార్. ఇప్పటి వరకూ ఎంత నష్టం కలిగిందనే అంశంపై కేసీఆర్ ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. పైగా సాయం అందించడంలో కూడా రాజకీయాల్ని తీసుకొచ్చారు. రోజుకో లెక్క చెబుతున్నారు. కేసీఆర్ ఐదు వందల యాబై కోట్లు ప్రకటించారు. దీనిపై రోజుకో మాట వినిపిస్తుంది. ఒకరోజు మూడు వందల కోట్లు పంపిణీ చేశామని చెప్పారు. ఇంకో రోజు మూడు వందల యాబై. ఈ రోజు మూడు వందల యనబై తొమ్మిది కోట్ల రూపాయిలు ఖర్చుపెట్టామని అంటున్నారు. మిగాతాది తర్వాత పంచుతారని అంటున్నారు. ఇదో కుట్ర. 13వ తేది తర్వాత జీహెచ్ఏంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి అప్పుడు మళ్ళీ ఎన్నికల ప్రచారంలో ఈ వరద సాయాన్ని పార్టీ ప్రచారం కోసం వాడుకుంటారు. ప్రజల సొమ్ముతో టీఆర్ఎస్ పార్టీ ప్రచారం. ఇంత దుర్మార్గమైన ఆలోచనతో వున్న టీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి” అని ఆయన పిలుపునిచ్చారు.
”కేసీఆర్ వరదలతో బురద రాజకీయలు చేస్తున్నారు. సర్వం కోల్పోయిన బాధితులకు సాయం అందడం లేదు. ముంపుగురి కాని ప్రాంతలో కూడా డబ్బులు పంచుతున్నారు. పంచుతున్న డబ్బులకు ఎకౌంటబిలిటీ లేదు. వాస్తవం చెప్పాలంటే .. ఇదో వైట్ కాలర్ క్రైమ్. ప్రభుత్వ అధికారులు, టీఆర్ఎస్ పార్టీకి కొమ్ముకాస్తూ, గులాబి ఏజెంట్లుగా మారి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న హేయమైన స్కామ్ ఇది. ఇంత చిల్లర రాజకీయం ప్రపంచంలో ఎక్కడా జరగదు” అని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.
”వరద సహాయాలు అందించేటప్పుడు వందరూపాయిలైనా చెక్కు రూపంలో ఇస్తాం. సొమ్ము చేతికిచ్చే దాఖలాలు ఎక్కడా లేవు. టీఆర్ఎస్ చిల్లర నాయకులు మాత్రం ప్రజల సొమ్ముని చేతిలోకి తీసుకున్నారు. వేల రూపాయిలు జేబులో వేసుకున్నారు. అసలు ఆ డబ్బు చేతిలోకి ఎలా వచ్చింది ? ప్రజల సొమ్ముని ముట్టుకునే అధికారం ఏ రాజ్యంగం వీరికి కల్పించింది? ఒకొక్క కార్పొరేటర్, ఒకొక్క వార్డ్ లీడర్ ఐదు, పది లక్షల రూపాయిలు దండుకున్నారు. ఇంత దోపిడీ, దుర్మార్గం నీచత్వం ఎక్కడా లేదు. దీన్ని అంత సులువుగా వదలం. ఈ దోపిడీ మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం” అని హెచ్చరించారు. ”అధికారం అడ్డం పెట్టుకొని ప్రజల సొమ్ముని దోచుకుతింటున్న వారికి శిక్ష పడాలంటే న్యాయవ్యవస్థ ముందుకు వచ్చి రక్షించాల్సిన అవసరం వుంది. లేకపొతే ప్రజలకు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం సన్నగిల్లుతుంది” అని పేర్కొన్నారు.