హైద్రాబాద్ వరద ముంపు ప్రాంతాల్లో 10 రోజుల పాటు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్

భారీ వర్షాలు, వరదలతో నగరంలో తీవ్ర ముంపు ప్రభావానికి గురైన 235 కాలనీలలో కొట్టుకువచ్చిన చెత్త, ఇతర వ్యర్థాలను తొలగించుటకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టినట్లు జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుండి 28వ తేదీ వరకు నగరంలో 89,134 మెట్రిక్ టన్నుల చెత్తను, వ్యర్థాలను తొలగించినట్లు తెలిపారు. ఆ మొత్తంలో 62,996 మెట్రిక్ టన్నుల చెత్తను జవహర్ నగర్ సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ప్లాంట్ కు తరలించినట్లు తెలిపారు. 15634 మెట్రిక్ టన్నుల భవన నిర్మాణ, శిథిలాల వ్యర్థాలను తొలగించి జీడిమెట్ల, ఫతుల్లాగూడలలోని సి అండ్ డి ప్లాంట్లకు పంపినట్లు తెలిపారు. అదేవిధంగా మరో 10,504 మెట్రిక్ టన్నుల రీసైక్లింగ్ వ్యర్థాలను సేకరించినట్లు తెలిపారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశాల మేరకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ను మరో 10 రోజుల పాటు కొనసాగించనున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా 10 సర్కిళ్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఆయా సర్కిళ్లవారిగా నియమించిన సంబంధిత స్పెషల్ శానిటేషన్ అధికారుల సెల్ నెంబర్లను సంప్రదించాలని ప్రజలకు విజ్ఞ‌ప్తి చేశారు. అలాగే శానిటేషన్ పై ప్రత్యేక వాట్సప్ నెంబర్: 97046 01866, జిహెచ్ఎంసి ఎమర్జెన్సీ కంట్రోల్ నెంబర్: 040-211 11 11 1 లకు ఫిర్యాదు చేయవచ్చునని సూచించారు. వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, వ్యర్థాలను తొలగించుటకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.  మిషన్ మోడ్ పద్దతిలో చేపట్టిన స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కొరకు అదనపు సిబ్బందిని, అదనపు వాహనాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. చెత్త తరలింపుకై రెగ్యులర్ గా  వినియోగిస్తున్న 242 వెహికిల్స్ కు అదనంగా 495 వెహికిల్స్ ను ఎంగేజ్ చేసి మొత్తం 737 వెహికిల్స్ ను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. అందులో 177 జె.సి.బి లు, 26 బాబ్ కాట్స్, 258 టిప్పర్లు, 6 టన్నుల సామర్థ్యం కలిగినవి 96 టిప్పర్లు, 10 టన్నుల సామర్థ్యం కలిగినవి 126 టిప్పర్లతో పాటు 44 ట్రాక్టర్లను వినియోగిస్తున్నట్లు తెలిపారు. అలాగే వరద ముంపు ప్రాంతాల్లో పేరుకుపోయిన బురదను, వరదనీటిని తొలగించుటకు 334 పంప్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ లో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ లకు చెందిన 1008 మందితో పాటు అదనంగా 1522 మందిని రోజువారి పద్దతిపై తీసుకొని వినియోగిస్తున్నట్లు తెలిపారు. అంటు వ్యాధులను నివారించుటకు, దోమల వ్యాప్తిని అరికట్టుటకు వరద ముంపు ప్రభావానికి గురైన కాలనీలలో బ్లీచింగ్, యాంటి లార్వా, క్రిమీసంహారకాలను స్ప్రేయింగ్ చేయిస్తున్నట్లు తెలిపారు. శానిటేషన్, ఎంటమాలజి విభాగాలకు చెందిన 23 వేల మంది సిబ్బందితో పాటు అదనంగా 2,530 మంది వర్కర్స్ ను వినియోగిస్తున్నట్లు తెలిపారు. భారీ వర్షాలు, వరదలతో పేరుకుపోయిన చెత్త, నిర్మాణ, ఇతర వ్యర్థాలను యుద్ద ప్రాతిపదికన తొలగించి సాధారణ స్థితికి తెచ్చేందుకు, అంటువ్యాధుల నివారణకు చేపట్టిన స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ లో రూ. 5 కోట్ల 51 లక్షలను ఇప్పటి వరకు ఖర్చు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ను ఇంకా 10 రోజుల పాటు కొనసాగించుటకు వినియోగిస్తున్న అదనపు వాహనాలు, సిబ్బందికి మరో రూ. 5 కోట్లు పైబడి ఖర్చు అవుతుందని తెలిపారు. వరద ముంపు ప్రాంతాల్లో పారిశుధ్య పనులను ముమ్మరంగా కొనసాగిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.