జగన్ సర్కార్ కు షాక్ ఇచ్చిన సుప్రీం కోర్ట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్ట్ షాక్ ఇచ్చింది. ఇంగ్లిష్ మీడియం విషయంలో హైకోర్టు ఆదేశాలపై స్టే కోరుతూ ఏపీ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించింది. ఈ క్రమంలో ఎస్‌ఎల్‌పీ, స్టేపై ప్రతివాదులకు దేశ అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 25కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

ఏపీలో ఇంగ్లిష్ మీడియంపై సుప్రీంకోర్టు జస్టిస్ చంద్రచూడ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అవకాశం లేకపోతే ఇంగ్లిష్ మీడియంలో బోధించవచ్చు. తెలుగులో బోధించే అవకాశం ఉన్నప్పుడు ఇంగ్లిష్‌ అవసరమేంటి?. తెలుగులో బోధనా సిబ్బంది కొరత ఉందా?’ అని చంద్రచూడ్ ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం లేనందువల్ల విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్ వైపు మొగ్గుచూపుతున్నారని తెలిపారు.

తెలుగు మీడియం విద్యా బోధన వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం తీవ్రంగా తగ్గిపోతుందని తెలిపారు. అంతేకాదు.. తల్లిదండ్రులపై ఆర్థికభారం పడకుండా ఉండేందుకు ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టామని విశ్వనాథన్‌ తెలిపారు. అనంతరం హైకోర్టు తీర్పుపై స్టే, నోటీస్ ఇవ్వాలని న్యాయవాది కోరారు. మాతృభాషలోనే విద్యాబోధన జరగాలన్న నిబంధన చట్టంలో లేదని ఆయన అన్నారు. ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన జరగాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రగతిశీలమని విశ్వనాథన్ వాదించారు.