మార్చిలో సినిమాలు రావు… అనుకొనేవాళ్లం. పరీక్షల సీజన్ కదా? వసూళ్లు ఉండవని నిర్మాతలు భయపడేవారు. అయితే ఈ సూత్రం ఈ యేడాది తప్పింది. మార్చిలో చిన్న సినిమాలన్నీ గుంపు గుంపుగా వచ్చేస్తున్నాయి. గత వారం ఐదారు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈవారం కూడా అరడజను సినిమాలున్నాయి. చుక్కలాంటి అమ్మాయి – చక్కనైన అబ్బాయి, మిస్టర్ మన్మథ, అరవింద్ 2, జఫ్ఫా, ప్రతికారం 3డీ… ఈ సినిమాలన్నీ ఈవారం ప్రేక్షకుల తీర్పు కోరుతూ రాబోతున్నాయి. అయితే ప్రేక్షకుల ఫోకస్ మాత్రం అరవింద్ 2, జఫ్ఫా సినిమాలపైనే ఉంది. ఎందుకంటే `చుక్కలాంటి అమ్మాయి..` ఇప్పటి సినిమా కాదు. ఎప్పుడో పూర్తయింది. ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల విడుదల తేదీ వాయిదా పడుతూ వచ్చింది. ఆ సినిమాపై ఉన్న క్రేజ్ ఎప్పుడో తగ్గిపోయింది. కృష్ణుడు-సోనియాల సినిమా మిస్టర్ మన్మథ ఎలాంటి ప్రచారం లేకుండానే వచ్చేస్తోంది. ఈ చిన్న సినిమాకి థియేటర్లు కూడా తక్కువే దొరికాయి.
ఇక జఫ్ఫా కూడా చాలా సైలెంట్ గా వస్తున్నాడు. వెన్నెల కిషోర్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. బ్రహ్మానందం ప్రధాన పాత్రధారి. వెన్నెల వన్ అండ్ ఆఫ్ సినిమాతో దర్శకుడిగా కిషోర్ సత్తా ఏమిటో జనానికి తెలిసింది. దాంతో జఫ్ఫాపై కూడా ఎవరికీ నమ్మకాల్లేవు. అరవింద్ 2 ప్రచార చిత్రాలు అందరినీ ఆకట్టుకొంటున్నాయి. శేఖర్ సూరి దర్శకత్వం వహించిన సినిమా ఇది. అరవింద్ తో ఆకట్టుకొన్న శేఖర్ కి ఆ తరవాత సినిమాలూ లేవు, చేసినా విజయం దక్కలేదు. దాంతో ఈ సినిమా కోసం చాలా కసిగా పనిచేసినట్టు తెలుస్తోంది. మల్లీప్లెక్స్ ఆడియన్స్ కి నచ్చినా.. సూరి ప్రయత్నం నెరవేరినట్టే. ఇక డబ్బిండ్ బొమ్మ కంచు భారీగానే విడుదల అవుతోంది. సూర్య, త్రిష జంటగా నటించారు. ఇది ఇప్పటి సినిమా కాదు. తమిళంలో ఆరేళ్ల క్రితమే వచ్చింది. తెలుగులో ఆ సినిమాని `ఆడంతే అదో టైపు` పేరుతో రీమేక్ కూడా చేశారు. ఆర్యన్ రాజేష్ కథానాయకుడిగా నటించిన ఆ సినిమా ఫ్లాప్ లిస్టులో చేరిపోయింది. ఇప్పుడు మళ్లీ ఆ సినిమాని ఏ థైర్యంతో డబ్ చేశారో వాళ్లకే తెలియాలి. హలీవుడ్ డబ్బింగ్ ప్రతీకారం 3డీ సినిమా కూడా వీటితో పోటీపడనుంది. గతవారం ఆరు సినిమాల్లో స్వామి రారా మాత్రం ఓ మోస్తరు విజయం సాధించింది. మరి… ఈ గుంపులో నిలబడే సినిమా ఏదో.. ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది.