స్టైల్‌కే… స్టైల్ నేర్పిన స్టార్‌!

Allu Arjun 2నాన్నది పాల‌కొల్లు. మావ‌య్యది మొగ‌ల్తూరు. ఒక‌రు మెగా ప్రొడ్యూస‌ర్‌, ఇంకొక‌రు మెగాస్టార్‌! తాత ఆల్రెడీ… కుమ్మేశాడు. గిన్నిస్ బుక్ ఎక్కి… తానేమిటో నిరూపించుకొన్న ఘ‌నుడు. అల్లు అర్జున్‌ బ్యాక్ గ్రౌండ్ ఇది! అయితే ఇవి చూసి ముచ్చట ప‌డ‌లేదు. `ఇంకేముంది, మ‌న‌కూ ప‌రిశ్రమ‌లో ఓ ప్లేసు గ్యారెంటీ..` అని ధీమాగా కూర్చోలేదు. ఇంటి పేరు కాపాడాలంటే మామూలు విష‌యం కాదు అనుకొన్నాడు. అర‌కొర ప్రతిభ‌తో అడుగుపెడితే.. ఎప్పటికైనా అల్లు అర‌వింద్ కొడుక‌నో, మెగాస్టార్ మేన‌ల్లుడ‌నో చెప్పుకొంటారు త‌ప్ప‌… త‌న‌కంటూ సొంత గుర్తింపు ద‌క్కద‌నుకొన్నాడు. అందుకే… క‌ష్టప‌డ్డాడు.. ఇప్పటికీ ప‌డుతూనే ఉన్నాడు. ఆ చెమ‌ట బిందువే.. అల్లు అర్జున్‌ని స్టైలిష్ స్టార్ చేసింది! అల్లు అర‌వింద్ అబ్బాయి బ‌న్నీ… అనిపించుకొనే స్థాయి నుంచి బ‌న్నీ వాళ్ల నాన్నగారు అర‌వింద్ అని చెప్పుకొనే పొజిష‌న్ కి చేరుకొన్నాడు. అదీ… బ‌న్నీ ఘ‌న‌త‌.

Allu Arjun`గంగోత్రి`తో బ‌న్నీ అడుగుపెట్టి.. మార్చి 28తో ప‌దేళ్లు పూర్తవుతాయి. ఈ ద‌శాబ్దంలో బ‌న్నీ ఎంతో సాధించాడు. త‌న‌కంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ఉంది, త‌న‌కంటూ ఓ అభిమాన గ‌ణం ఉంది. బ‌న్నీ సినిమా అంటే.. అన్ని హంగులూ ఉంటాయ‌నే న‌మ్మకం ఉంది. అయితే ఇదంతా తేలిగ్గా దొర‌క‌లేదు. గంగోత్రి సినిమా హిట్టే. కానీ ఆ సినిమా చూసి `కుర్రాడు మ‌రీ లేత‌గా ఉన్నాడు` అనుకొన్నారంతా. `ఇంకా మీసాలు రాలేదు, హీరోగా ఎర్లీ ఇంట్రీ ప‌నికిరాదు..` అని విమ‌ర్శించిన‌వాళ్లూ ఉన్నారు. ఆ సినిమా క్రెడిట్ అంతా ద‌ర్శకేంద్రుడి ఖాతాలో చేరిపోయింది. ఇక `ఆర్య‌`తో బ‌న్నీ స్టామినా తొలిసారి తెలిసింది. న‌ట‌న‌, డాన్స్‌, ఫైట్స్ ఇలా అన్నిటా తానేమిటో నిరూపించుకొన్నాడు. బ‌న్నీతో 100% మాస్ హీరో అయిపోయాడు. బ‌న్నీ సినిమా అంటే అందులో అదిరిపోయే స్టెప్పులు ఉండాల్సిందే. ఆర్య 2 చూసి… డాన్స్ ప్రియులు తెగ ముచ్చట ప‌డ్డారు. టాలీవుడ్‌లో డాన్స్ అంటే.. బ‌న్నీ గుర్తుకురావల్సిందే. ఆ సినిమా ఆశించినంత ఫ‌లితం తీసుకురాలేదు. కానీ.. బ‌న్నీలో ఓ కొత్త యాంగిల్ జ‌నానికి తెలిసింది. నెగిటివ్ ట‌చ్ ఉన్న పాత్ర పోషించి వారెవా అనిపించాడు.

Allu Arjun 1ఎప్పుడూ ఓ మాస్ హీరోగానే మిగిలిపోవాల‌ని బ‌న్నీ అనుకోలేదు. త‌న స్థాయికి త‌గిన‌ట్టు ప్రయోగాలూ చేశాడు. వేదం అలాంటి సినిమానే. ఆ సినిమా మ‌రింత క‌మర్షియ‌ల్ విజ‌యం సాధిస్తే.. బ‌న్నీ ఆ దిశ‌గా అడుగులు వేసేవాడేమో. కానీ.. నిర్మాత‌కు లాభాలు అంద‌క‌పోడంతో కాస్త వెనుక‌డుగు వేశాడు. టాలీవుడ్‌కి స్టైల్ అనే ప‌దం కొత్తగా ప‌రిచ‌యం చేసింది అల్లు వారి పిల్లడే. దేశ‌ముదురుతో తొలిసారి సిక్స్‌ప్యాక్ చూపించిన టాలీవుడ్ స్టార్ అయ్యాడు. ఆ త‌ర‌వాత అంద‌రూ బ‌న్నీని ఫాలో అయ్యారు. బద్రినాథ్‌తో అత‌ని యాక్షన్ స్టామినా ప‌రిశ్రమ‌కు మ‌రోసారి తెలిసొచ్చింది. జులాయితో ఎంతోకాలంనుంచి ఎదురుచూస్తున్న నిఖార్సయిన విజ‌యం అందుకొన్నాడు. ఇప్పుడు ఇద్దర‌మ్మాయిల‌తో రొమాన్స్ చేస్తున్నాడు. కేర‌ళ‌లో త‌న‌కంటూ ఓ అభిమాన గ‌ణాన్ని సంపాదించుకొన్న బ‌న్నీ… ఇప్పుడు త‌మిళంలోనూ పాగా వేయాల‌నుకొంటున్నాడు. అక్కడా బ‌న్నీ విజ‌య‌ప‌తాక ఎగ‌ర‌వేయాల‌ని తెలుగు మిర్చి మ‌న‌సారా ఆకాంక్షిస్తోంది. రాబోయే ప‌దేళ్ళలో బ‌న్నీ.. మ‌రింత పైకి ఎద‌గాల‌ని, ప్రేక్షకుల్ని ఇలాగే మెప్పించాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకొంటోంది. ఆల్ ది బెస్ట్‌..