శ్రీశైలం ఎడమ జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటన లో ఎన్డీఆర్ఎఫ్ సహాయక సిబ్బంది ఆరు మృతదేహాలను వెలుపలికి తీసుకువచ్చారు. అందులో ఒకరు సుందర్ నాయక్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు. సుందర్ నాయక్ మృతదేహన్ని వెలికి తీసిన తర్వాత మరో ఐదుగురి మృతదేహాలను రెస్క్యూ టీమ్ బయటకు తీసింది. ఈ మృత దేహాలను సైతం పోస్టు మార్టం నిమిత్తం అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఏఈ మోహన్‌కుమార్, ఏఈ ఉజ్మ ఫాతిమా కూడా ఉన్నట్లు గుర్తించారు.
నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమల పెంట దగ్గర నాలుగో యూనిట్ టెర్మినల్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మొత్తం ఆరు యూనిట్లలో పొగలు కమ్ముకున్నాయి. పొగలు రావడాన్ని గమనించి డీఈ పవన్‌కుమార్‌తో పాటు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బంది కొందరు వెంటనే బయటకు పరుగులు తీశారు. చూస్తూ ఉండగానే కరెంటు ఉత్పత్తి నిలిచిపోయింది.
మంటలు ఆరిపోగా పొగలు మాత్రం దట్టంగా అలుముకున్నాయి. విద్యుత్ కేంద్రం నుంచి 8 మంది సురక్షితంగా బయటకు రాగా మరో 9 మంది అందులోనే చిక్కుకుపోయారు. వీరిలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. మిగతా ముగ్గురి ఆచూకీ కోసం అధికార యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది.