ఏపీలో న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాపింగ్ కు గురవుతున్నాయని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర ఆరోపణలు చేశారు. న్యాయ వ్యవస్థపై నిఘా అనే పేరుతో పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయని చెప్పారు.
పార్క్ హయత్ లో ఏదో జరిగిందంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారని… ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేందుకు ఇదే నిదర్శనమని అన్నారు. లేకపోతే ఎవరెవరు ఎవరితో మాట్లాడారనే విషయం విజయసాయికి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. ‘జగన్ గారు, మీ చుట్టూ ఉన్న అసాంఘిక శక్తులు ఎవరనే విషయాన్ని పసిగట్టండి’ అని సూచించారు. రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేశారనే అప్రతిష్టను మూటకట్టుకోవద్దని అన్నారు. తమరి దురభిమానుల నుంచి తనకు ఫోన్ చేయించి, వేధించవద్దని విన్నవిస్తున్నానని చెప్పారు. ఫోన్ ట్యాంపింగ్ అంశంపై చర్యలు తీసుకోకపోతే… ఆ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతానని అన్నారు.