ఇప్పటికే ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి కొత్తపుంతలు తొక్కుతోంది. తాజాగా కొవిడ్ 19 వైరస్ D614G రకం మ్యుటేషన్ బయటపడినట్లు మలేషియా పరిశోధకులు వెల్లడించారు. అత్యంత వేగంగా వ్యాపించే ప్రభావం ఉన్న ఈ వైరస్‌ను ఎదుర్కోవడంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే ఈ తరహా మ్యుటేషన్ ఇప్పటికే పలుదేశాల్లో బయటపడ్డట్లు నిపుణులు పేర్కొన్నారు.
చైనాలో పుట్టిన వైరస్ రూపాంతరం చెందుతూ ప్రపంచదేశాలను సంక్షోభంలోకి నెట్టేసింది. ఇప్పటికే ఈ వైరస్ ఎన్నో ఉత్పరివర్తనాలు చోటుచేసుకున్నట్లు గుర్తించారు. అయితే వాటి స్వభావం, తీవ్రతపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా ప్రమాదకరంగా భావిస్తోన్న D614G రకం మ్యుటేషన్‌ను మలేషియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ రీసెర్చ్ గుర్తించింది.