కరోనా వ్యాక్సిన్‌ ను విడుదల చేసిన రష్యా ..

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గజగజలాడిస్తున్న వేళ రష్యా తీపి కబురు తెలిపింది. తొలి వ్యాక్సిన్‌ను విడుదల చేసినట్లు తెలిపి అందరిలో సంతోషాన్ని నింపింది. అంతేకాదు, ఆ తొలి టీకాను తన కుమార్తెకు ఇచ్చినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం (ఆగస్టు 11) ప్రకటించారు. దీంతో కరోనా వ్యాక్సిన్‌ను రిజిస్టర్‌ చేసిన తొలి దేశంగా రష్యా అవతరించింది. టీకా సమర్థంగా పనిచేస్తోందని.. రోగనిరోధక శక్తి పెరిగి వైరస్‌ నియంత్రణలోకి వస్తోందని పుతిన్‌ తెలిపారు.

వ్యాక్సిన్‌ పనితీరుపై తనకు సమాచారం అందించాలని ఆరోగ్య మంత్రి మైఖేల్‌ మురష్కోను ఆయన కోరారు. ఈ నెలలోనే కరోనా వ్యాక్సిన్‌ను ప్రజల ముందుకు తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించామని చెప్పారు. కొద్దివారాల్లోనే పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌ ఉత్పత్తిని చేపట్టి లక్షలాది డోసులను సరఫరా చేస్తామని తెలిపారు.