ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర మహిళలకు తీపి కబురు తెలిపారు.ఆరోగ్య ఆసరా పథకం కింద ప్రసవం కాగానే మహిళలకు రూ.5వేల చొప్పున సాయం అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అధికారులతో సమీక్షా జరిపిన జగన్ పలు అంశాలపై అధికారులతో మాట్లాడారు.
స్కూళ్లలాగే అంగన్వాడీ కేంద్రాల్లో ‘నాడు-నేడు’10 రకాల మౌలిక సదుపాయాలను కల్పించాలని నిర్ణయించారు. ప్రీ ప్రైమరీ 1, 2లపై ఫోకస్ పెట్టాలన్నారు. భవిష్యత్తులో అంగన్వాడీ కార్యకలాపాలను మరింత పటిష్టం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ అమలు తీరుపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న వారిని ప్రోత్సహించాలన్నారు. గర్భవతులు, బాలింతలు సహా 36 నెలలోపున్న శిశువులను ఒకలా.. 36 నుంచి 72నెలల వరకున్న చిన్నారులను మరోలా చూడాల్సి ఉంటుందని అన్నారు.
అంగన్వాడీలోని పిల్లలకు లెర్నింగ్ స్కిల్స్ కోసం టూల్స్, టీవీ, సహా ప్రత్యేక పుస్తకాలను అందించాలని.. అంగన్వాడీల్లో ఆహారం ఎక్కడ తిన్నా ఒకే నాణ్యత ఉండాలన్నారు. దీనిపై సమగ్రంగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. సిలబస్పైనా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.