నగరిలో సంపూర్ణ లాక్‌డౌన్ చేసే ఆలోచన లో ఎమ్మెల్యే రోజా..

రాష్ట్రంలో కరోనా ఉదృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఏరియా కేసులను బట్టి లాక్ డౌన్ చేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాలో లాక్ డౌన్ చేపట్టగా..నగరి నియోజకవర్గ పరిధిలో మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని ఎమ్మెల్యే రోజా ఆలోచిస్తుంది. ప్రజలను సన్నద్ధం చేసిన తర్వాత అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపారు.

మంగళవారం తన కార్యాలయంలో నగరి నియోజకవర్గ అధికారులతో ఆమె సమావేశమయ్యారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలు, కావాల్సిన సదుపాయాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు అధికారులు. అన్‌లాక్ 1 తర్వాత ప్రజల్లో మార్పు వచ్చిందని.. ఎవరూ నిబంధనలను పాటించడం లేదని చెప్పారు. మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తేనే మంచిదని ఎమ్మెల్యేకు సూచించారు. అయితే కరోనా కట్టడికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది. ఎక్కడా లేని విధంగా ఉచిత పరీక్షలు చేయిస్తున్నాం. ప్రజల నిర్లక్ష్యం వల్లే వైరస్ వ్యాప్తి చెందుతుందని ఆమె అన్నారు. మరోసారి పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ విధించడమే కరోనా కట్టడికి ప్రస్తుతం ఉన్న మార్గం. లాక్‌డౌన్‌పై ప్రజల్లో రెండు రోజుల పాటు అవగాహన కల్పించి.. ఆ తర్వాత వారం పాటు లాక్‌డౌన్ విధిస్తాం అని తెలిపారు.