ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి కి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ. హనుమంతరావు (వీహెచ్) చురకలు అంటించారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి శుక్రవారం హైకోర్టు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను కొనసాగించాలని ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ. హనుమంతరావు (వీహెచ్) స్పందించారు.
నిమ్మగడ్డ రమేశ్ వ్యవహారంలో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లొద్దని సూచించారు. ఈ వ్యవహారంలో పంతానికి పోకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ను ఎఈసీ స్థానంలో కొనసాగించి జగన్ మంచిపేరు తెచ్చుకోవాలని హితవు పలికారు. జగన్ నిర్ణయాలతో ఆయన నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిష్ఠను దెబ్బ తీయవద్దని మంచి మాటలు చెప్పారు.